Fake News, Telugu
 

తన పార్టీకి ఓటు వేసే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని వై.ఎస్. జగన్ వాగ్దానం చేసినట్టు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఒక బహిరంగ సభలో ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 2018లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ విశాఖ జిల్లా కే. కోటపాడు గ్రామంలో ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. చంద్రబాబుని క్షమిస్తే ఎన్నికల సమయంలో తమకు ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అబద్దపు వాగ్ధానాలు చేస్తాడని జగన్ తన ప్రసంగంలో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వీతికితే, ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి వివరాలు దొరకలేదు. ఈ వీడియోకి సంబంధించిన వివరాల కోసం కి పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఈటీవీ వార్తా సంస్థ 04 సెప్టెంబర్ 2018 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ విశాఖపట్నం జిల్లా కే. కోటపాడు గ్రామంలో ప్రసంగిస్తున్న దృశ్యాలని ఈటీవీ వార్తా సంస్థ ఈ వీడియోని పబ్లిష్ చేశారు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ 03 సెప్టెంబర్ 2018 నాడు కే.కోటపాడు గ్రామంలో చేసిన ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ చంద్రబాబు లాంటి అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తిని క్షమిస్తే, ఎన్నికల వేళ ప్రజల దగ్గరకు వచ్చి తన ఎన్నికల ప్రణాళికలో 99 శాతం వాగ్ధానాలు పూర్తి చేసానని, ఈ సారి తమ పార్టీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెబుతాడని జగన్ చంద్రబాబుని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. కోటపాడులో వై.ఎస్. జగన్ ఇచ్చిన ప్రసంగం యొక్క పూర్తి వీడియోని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపొందించారు.

2019 ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన మరికొన్ని సభలలో కూడా వై.ఎస్. జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని వై.ఎస్. జగన్ ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll