టోక్యోలో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం సాధించిందని చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత రెజ్లర్ ప్రియా మాలిక్.
ఫాక్ట్: భారత రెజ్లర్ ప్రియా మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవలేదు; అసలు తను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనట్లేదు. హంగేరీలో జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తను బంగారు పతకం సాధించింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇప్పటివరకు (ఈ ఆర్టికల్ రాసే సమయానికి) భారతదేశానికి టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం రాలేదని, కేవలం ఒక రజత పతకం మాత్రమే వచ్చిందని తెలిసింది. ఆ రజత పతకం కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి వచ్చింది.
అంతేకాదు, టోక్యో ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల లిస్టులో కూడా ప్రియా మాలిక్ పేరు లేనట్టు చూడవొచ్చు.
అయితే, భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచింది హంగేరీ దేశంలో జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో అని తెలిసింది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ వారు ప్రియా మాలిక్ గెలుపు గురించి చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవొచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
హంగేరీ దేశంలో జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కీ, టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌కి సంబంధంలేదు. వరల్డ్ క్యాడెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో గెలిచిన పతకాలను ఒలింపిక్స్ పతకాల లిస్టులో జోడించరు. వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ గెలిచిన పతకాల గురించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచింది హంగేరీలో జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో; టోక్యో ఒలింపిక్స్‌లో కాదు.