Fake News, Telugu
 

ఎన్టీఆర్‌కి ఒక్కసారి కూడా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించలేదు

0

1963లో ఎన్టీఆర్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించిన సందర్భంలో ఆ అవార్డుని ఆయనకు అందిస్తూ అప్పటి భారత రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తాను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ స్వరూపమే కృష్ణుడిగా కనిపిస్తుందని చెప్పారంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 1963లో ఎన్టీఆర్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చే సమయంలో తాను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ స్వరూపమే కృష్ణుడిగా కనిపిస్తుందని అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు.

ఫాక్ట్: కేవలం 1968 నుంచే (1967లో విడుదలైన సినిమాల నుంచి) సినిమాల్లో నటించే నటీనటులకు మరియు నిపుణులకు అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. కానీ, 1967లోనే రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పదవీకాలం ముగిసింది. పైగా, ఇప్పటివరకు ఎన్టీఆర్ తో సహాయ మరే ఇతర తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కలేదు. భగవద్గీత చదువుతున్నప్పుడల్లా తనకి ఎన్టీఆర్ స్వరూపమే కృష్ణుడిగా కనిపిస్తుందని రాధాకృష్ణన్ వ్యాఖ్యానించినట్లు కూడా ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రధానం చేసే ‘Directorate of Film Festivals’ వెబ్‌సైట్ ప్రకారం, 1954 నుంచే సినిమాలకు జాతీయ అవార్డులను ఇవ్వడం ప్రారంభించినప్పటికీ కేవలం 1968 నుంచే (1967లో విడుదలైన సినిమాల నుంచి) చలనచిత్రాల్లో నటించే నటీనటులకు మరియు నిపుణులకు అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు.

అయితే, 1967లోనే రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవీకాలం ముగియడంతో, 1968 సంవత్సరంలో ప్రవేశపెట్టిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ బెంగాలీ నటుడైన ఉత్తమ్ కుమార్‌కి ప్రధానం చేశారు.

పైగా, ‘Directorate of Film Festivals’ వెబ్‌సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఎన్టీఆర్ తో సహాయ మరే ఇతర తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కలేదు. దీన్ని బట్టి ఎన్టీఆర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని తీసుకోలేదని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే, రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయిన తర్వాత చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను కలిశారు, అయితే ఇక్కడ కూడా రాధాకృష్ణన్ వైరల్ పోస్టులో చెప్పబడిన వ్యాఖ్యలు చేసినట్లు తగిన ఆధారాలు లేవు.

చివరిగా, ఎన్టీఆర్‌కి ఎప్పుడూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. భగవద్గీత చదువుతున్నప్పుడల్లా తనకి ఎన్టీఆర్ స్వరూపమే కృష్ణుడిగా కనిపిస్తుందని రాధాకృష్ణన్ వ్యాఖ్యానించినట్లు ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll