Fake News, Telugu
 

కేరళకు సంబంధించి కార్మికుల రోజువారీ వేతన వివరాలను రోజువారీ ఆదాయ వివరాలంటూ షేర్ చేస్తున్నారు

0

‘గ్రామీణ పేదలకు రోజుకి సగటున ఆదాయం సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో రూ. 677 కాగా, అదే బీజేపీ పాలిత గుజరాత్‌లో రూ. 239, ఉత్తరప్రదేశ్‌లో రూ. 289, జాతీయ సగటు రూ. 315గా’ ఉందని చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గ్రామీణ పేదలకు రోజుకి సగటున ఆదాయం కేరళలో రూ. 677 కాగా, అదే బీజేపీ పాలిత గుజరాత్‌లో రూ. 239 మరియు ఉత్తరప్రదేశ్‌లో రూ. 289.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినవి రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన 2020-21 సంవత్సరానికి గాను వ్యవసాయేతర పనులు చేసే గ్రామీణ పురుష కార్మికుల సగటు రోజువారీ వేతన వివరాలు. ఈ విభాగం, ఇంకా ఇతర విభాగాలలో కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో సగటు రోజువారీ వేతనాలు ఎక్కువే. ఐతే ఈ వివరాలని మొత్తం గ్రామీణ జనాభా రోజువారీ సగటు ఆదాయంగా పరిగనించలేము. రెండిటికి చాలా తేడా ఉంది. కేరళ స్టేట్ ప్లానింగ్ బోర్డు  వివరాల ప్రకారం 2019-20 సంవత్సరంలో కేరళ తలసరి వార్షిక ఆదాయం రూ. 1,49,563, అంటే రోజువారీ ఆదాయం వైరల్ పోస్టులో చెప్పినదాని కంటే చాలా తక్కువగా ఉంటుంది. పైగా రాష్ట్ర GSDPలో గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యంగా ఉండే ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా తక్కువ. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ప్రతీ సంవత్సరం అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వివిధ సామాజిక-ఆర్థిక సూచికలకు సంబంధించిన డేటాని ‘హ్యాండ్‌బుక్ అఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో ఒక హ్యాండ్‌బుక్‌ని విడుదల చేస్తుంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి నవంబర్ 2021లో కూడా హ్యాండ్‌బుక్‌ని విడుదల చేసింది. ఈ హ్యాండ్‌బుక్‌లో రాష్ట్రాల వారీగా పలు రంగాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో సగటు రోజువారీ వేతన రేట్ల యొక్క డేటాని అందించింది. పోస్టులో చెప్తున్న వివరాలు ఈ హ్యాండ్‌బుక్‌లో వ్యవసాయేతర పనులలో రాష్ట్రాల వారీగా పురుషుల సగటు రోజువారీ వేతన రేట్లకు సంబంధించిన డేటా నుండి సేకరించిందే.

ఈ హ్యాండ్‌బుక్‌ ప్రకారం 2020-21 సంవత్సరంలో గ్రామీణ పురుష కార్మికుల విభాగానికి సంబంధించి కేరళలో వ్యవసాయేతర పనులు చేసే ఒక కార్మికుడి సగటు రోజువారీ వేతనం రూ. 677.6తో  దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధికంగా నిలిచింది. ఈ విభాగంలో జాతీయ సగటు రూ. 315.3 కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో సగటు రోజువారీ వేతనం రూ. 239.3 మరియు రూ. 286.8గా ఉన్నాయి. ఇతర విభాగాలలో (పురుషులు – నిర్మాణ కార్మికులు మరియు సాధారణ వ్యవసాయ కార్మికులు) కూడా కేరళలో సగటు రోజువారీ వేతనం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

ఐతే రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన ఈ సగటు రోజువారీ వేతన (గ్రామీణ పురుష- వ్యవసాయేతర రంగాలలో) వివరాలను తప్పుగా అర్ధం చేసుకొని మొత్తం గ్రామీణ జనాభా సగటు రోజువారీ ఆదాయం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐతే సగటు రోజువారీ వేతనానికి మరియు సగటు రోజువారీ ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉంది.

కేరళ స్టేట్ ప్లానింగ్ బోర్డు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం కేరళలో 2019-20 సంవత్సరానికి తలసరి వార్షిక ఆదాయం రూ. 1,49,563గా ఉంది, కాని పోస్టులో చెప్పినట్టు రూ. 677ని రోజువారీ ఆదాయంగా పరిగణించి లెక్కిస్తే వార్షిక ఆదాయం సుమారు రెండు లక్షల యాబై వేలు ఉండాలి. దీన్నిబట్టి, పోస్టులో చెప్తున్న వివరాలు రోజువారీ ఆదాయానికి సంబంధించినవి కావని అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కేరళలో 2019-20 సంవత్సరానికి ప్రైమరీ సెక్టార్‌లో (వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) విలువ రూ. 42,373.83 కోట్లు కాగా, సెకండరీ సెక్టార్ మరియు టేరిటరీ సెక్టార్ GSDP విలువ రూ. 1,41,805.63 కోట్లు   మరియు రూ. 3,17,781.22 కోట్లుగా ఉంది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక తలసరి ఆదాయం ఇతర రెండు రంగాలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది (వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం వారే ఉంటారు), ఎందుకంటే GSDP ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ తక్కువ కాబట్టి.

చివరగా, కేరళకు సంబంధించి కార్మికుల రోజువారీ వేతన వివరాలను తప్పుగా అర్ధం చేసుకొని రోజువారీ ఆదాయ వివరాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll