మంథని తాడిచర్ల మైన్స్ దగ్గర పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మంథని తాడిచర్ల మైన్స్ దగ్గర పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనభద్ర జిల్లాలోని NCL క్రిష్ణశిల మైన్ దగ్గర ఇటీవల చిరుత పులి సంచరించిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోని NCL క్రిష్ణశిల మైనులో పనిచేస్తున్న కార్మికులు తీసారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పులి తెలంగాణ మంథని తాడిచర్ల మైన్స్ దగ్గర కనిపించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘గోరఖ్పూర్ సిటి న్యూస్’ ఛానల్ 07 డిసెంబర్ 2021 నాడు తమ ఫేస్‌బుక్ పేజిలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనభాద్ర జిల్లాలోని NCL క్రిష్ణశిల మైన్ దగ్గర పులి సంచరిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు.
ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని ‘లైవ్ హిందూస్తాన్’ వార్తా సంస్థ 06 డిసెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. సోనభద్ర జిల్లాలోని NCL క్రిష్ణశిల మైన్ దగ్గర చిరుత పులి సంచరించిన దృశ్యాలని అక్కడి కార్మికులు వీడియో తీసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. NCL క్రిష్ణశిల, ఇతర మైనింగ్ కంపనీల కారణంగా వాటికి ఆనుకొని ఉన్న అడవి అంతరిస్తుండడంతో, అడవి ప్రాణులు ఈ మైనింగ్ కంపెనీల పరిసరాలలో కనిపిస్తున్నట్టు ఆర్టికల్‌లో తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పులి సంచరిస్తున్న విషయాన్ని ఇటీవల పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. పెద్దపల్లి జిల్లాకు సమీపంలో ఉన్న జయశంకర్-భుపాలపల్లి జిల్లా మీదుగా ఈ పులి మంథని మండలంలోకి ప్రవేశించిందని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని NCL క్రిష్ణశిల మైన్ దగ్గర తీసారు, మంథని తాడిచర్ల మైన్స్ దగ్గర కాదు.
చివరగా, ఉత్తరప్రదేశ్ NCL క్రిష్ణశిల మైనులో పులి కనిపించిన దృశ్యాలని మంథని తాడిచెర్ల మైన్స్ దగ్గర పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.