ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఒక ముస్లిం వ్యక్తి గుల్బర్గాలోని 17,000 ఎకరాల వక్ఫ్ భూముల గురించి ప్రసంగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే వీడియోలోని వ్యక్తి “వక్ఫ్ బోర్డ్ అనేది కరెక్ట్‌గా పని చేస్తే ముస్లింలు ఏ పని చేయనవసరం లేదని, ఏ లోను కోసం తిరిగే అవసరం లేదని, గుల్బర్గాలోనే 17వేల ఎకరాలు ఉన్నాయి, ఇవిగాక ఇంకా చాలా భూములు ఉన్నాయి అవన్నీ మనం తీసుకుందాం, ఇప్పటినుండి మనకు ఏ రూల్స్ అవసరం లేదు” అని ప్రసంగించాడని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో గుల్బర్గాలోని 17,000 ఎకరాల వక్ఫ్ భూములు మనమే తీసుకుందాం అని ఒక ముస్లిం నేత ప్రసంగిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి గుల్బర్గా జిల్లా వక్ఫ్ సలహా కమిటీ చైర్మన్ సయ్యద్ హబీబ్ సర్మస్త్. తాను ఈ ప్రసంగం కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందే చేసాడు. ముస్లింలు తమ వక్ఫ్ బోర్డును సక్రమంగా నిర్వహిస్తే, వారికీ రిజర్వేషన్లు, లోన్లు అవసరం లేదన్న ఉద్దేశంతో మాట్లాడాడు. పైగా చాలా వరకు వక్ఫ్ భూములు ముస్లింలే ఆక్రమించుకున్నారని కూడా తను ఈ ప్రసంగంలో అన్నాడు. హబీబ్ సర్మస్త్ చేసిన ఈ ప్రసంగాన్ని వక్రీకరించి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న వీడియోలో ప్రసంగిస్తున్నది గుల్బర్గా జిల్లా వక్ఫ్ సలహా కమిటీ చైర్మన్ సయ్యద్ హబీబ్ సర్మస్త్. ఐతే ఈ ప్రసంగంలో సర్మస్త్, గుల్బర్గాలోని వక్ఫ్ భూములకు సంబంధించిన వ్యాఖ్యలు వేరే ఉద్దేశంలో చేసాడు. పైగా ఈ ప్రసంగానికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎటువంటి సంబంధం లేదు.
ఈ ప్రసంగాన్ని హబీబ్ సర్మస్త్ తన ఫేస్‌బుక్‌లో 29 ఏప్రిల్ 2023 నాడు షేర్ చేసాడు. దీన్నిబట్టి ఈ ప్రసంగానికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ మధ్య 13 మే 2023న విడుదలైయ్యాయి.
ఒక మసీదు ప్రారంభోత్సవంలో చేసిన ఈ ప్రసంగంలో మాట్లాడుతూ ”ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదు. ముస్లింలకు రుణాలు అవసరం లేదు. ముస్లింలు తమ వక్ఫ్ బోర్డును సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వానికే మనం రుణాలు ఇవ్వవచ్చు. గుల్బర్గాలో వక్ఫ్ బోర్డు పరిధిలో 27 వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో 17,000 ఎకరాలను ముస్లింలే ఆక్రమించుకున్నారు. జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 40 ఏళ్లుగా ఆక్రమణకు గురైన 1,100 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నాను” అని సర్మస్త్ అన్నాడు.
“మన భూమి తిరిగి మనకు దక్కితే మన యువత భవిష్యత్తు భాగుపడుతుంది. అలా చేస్తే మన అమ్మాయిలు రూ. 5,000/ రూ. 10,000 రుణాల కోసం 2-3 గంటలు మైనార్టీ ఆఫీసు బయట క్యూలో నిలబడాల్సిన పని ఉండదు”, అని కూడా అన్నాడు.
ఐతే సర్మస్త్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పుగా అర్ధం చేసుకొని, ‘మనకు ఏ రూల్స్ అవసరం లేదు, ముస్లింలు ఏ పని చేయనవసరం లేదని, ఏ లోను కోసం తిరిగే అవసరం లేదు, వక్ఫ్ బోర్డ్ భూములు మనమే తీసుకుందాం’ అని అన్నట్టు వక్రీకరించి షేర్ చేస్తున్నారు.
చివరగా, వక్ఫ్ భూములకు సంబంధించి గుల్బర్గా జిల్లా వక్ఫ్ సలహా కమిటీ చైర్మన్ మాట్లాడిన వీడియోను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.