Fake News, Telugu
 

సౌర శక్తిని సరఫరా చేసే సబ్‌మెరైన్ పవర్ కేబుళ్లు ఇదివరకే అనేక దేశాల మధ్య నిర్మించబడ్డాయి

0

భారత్‌లో ఉత్పత్తి అయ్యే సౌరశక్తిని (సోలార్ ఎనర్జీ) సముద్రం అడుగు భాగాన ఉన్న పవర్ కేబుల్స్ ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని, ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.  

క్లెయిమ్: ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా లేని విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే సౌరశక్తిని సబ్‌మెరైన్ పవర్ కేబుల్స్ ద్వారా విదేశాలకు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఫాక్ట్: భారత్‌లో ఉత్పత్తి జరిగే సౌరశక్తిని/పునరుత్పాదక శక్తిని సబ్‌మెరైన్ పవర్ కేబుళ్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు భారత్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ, ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే అనేక దేశాల మధ్య పునరుత్పాదక శక్తి సరఫరా కోసం ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2026 నాటికల్లా భారత్ సోలార్ మాడ్యూల్‌లను తయారీ చేయడం ద్వారా దేశంలో ఉత్పత్తి అయ్యే సౌరశక్తిని విదేశాలకు సరఫరా చెయ్యాలని ప్రభుత్వం భావిస్తునట్లు నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ భూపీందర్ భల్లా పేర్కొన్నారు.

అలాగే, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి  దేశాలతో పవర్ గ్రిడ్‌ను అనుసంధానం చేయడానికి వీలుగా సముద్ర అడుగు భాగాన సబ్‌మెరైన్ కేబుళ్లను నిర్మించడానికి ఆయా దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. అయితే ఈ విధంగా సబ్‌మెరైన్ కేబుల్‌ల ద్వారా ఒక దేశం నుంచి మరొక దేశానికి పునరుత్పాదక/సౌర విద్యుత్తుని సరఫరా చేయడం ఇదే మొదటిసారి కాదు. పలు దేశాల మధ్య ఇదివరకే నిర్మించబడ్డ ప్రాజెక్టులను కింద చూడవచ్చు.

నార్త్ సీ లింక్: 2021 లో పూర్తైన ఈ ప్రాజెక్టులో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ మరియు నార్వే దేశాల మధ్య 720 కిలోమీటర్ల సబ్‌మెరైన్ కేబుల్‌ల ద్వారా ఇరుదేశాల అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక శక్తి సరఫరా అవుతుంది.

నెమో లింక్: 2019లో యునైటెడ్ కింగ్డమ్ మరియు బెల్జియం దేశాల మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. షుమారు 140 కిలోమీటర్ల పొడవుండే సబ్‌మెరైన్ కేబుల్‌ల ద్వారా ఇరు దేశాలకు సౌరశక్తితో పాటు ఇతర పునరుత్పాదక విద్యుత్ శక్తులు కూడా సరఫరా అవుతాయి.

అలాగే వివిధ దేశాల మధ్య పునరుత్పాదక/ సౌర శక్తులను సబ్‌మెరైన్ కేబుల్‌ల ద్వారా సరఫరా జరిగే విధంగా నిర్మించిన లేదా నిర్మించబడుతున్న ప్రాజెక్టుల వివరాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, పునరుత్పాదక/ సౌర విద్యుత్‌ను సరఫరా చేయడానికి అవసరమయ్యే సబ్‌మెరైన్ పవర్ కేబుళ్లు ఇదివరకే అనే ప్రాంతాలలో నిర్మించబడ్డాయి.

Share.

About Author

Comments are closed.

scroll