Fake News, Telugu
 

కేరళలో దుర్గావాహిని కార్యకర్తలు సాధారణంగా నిర్వహించే శౌర్య యాత్ర వీడియోని ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో ముడిపెడుతున్నారు

0

కేరళలోని మావేలికర నగరంలో వేలాది మంది హిందూ మహిళా కార్యకర్తలతో శౌర్య యాత్ర పథసంచలన్ నిర్వహించిన కేరళ దుర్గావాహిని విభాగం, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం తరువాత కేరళలో హిందూ అమ్మాయిలలో మొదలయిన మార్పును ఈ శౌర్య యాత్ర దృశ్యాలు చూపిస్తున్నాయంటూ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ‘ది కేరళ స్టోరీ’ చిత్రం తరువాత కేరళలో దుర్గావాహిని నిర్వహించిన శౌర్య ర్యాలీలో వేలాది హిందూ మహిళలు పాలుపంచుకున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కేరళలోని మావేలికర నగరంలో ఇటీవల జరిగిన దుర్గావాహిని శౌర్య యాత్ర దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, కేరళలో దుర్గావాహిని శౌర్య యాత్రలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన దుర్గావాహిని శౌర్య యాత్రలో కూడా వందలాది మహిళ కార్యకర్తలు కత్తులు, కట్టెలు పట్టుకొని ర్యాలీ మార్చ్ చేశారు. ఈ దుర్గావాహిని శౌర్య యాత్రకు ‘ది కేరళ స్టోరీ’తో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని సురేశ్ కొచ్చటిల్ అనే వ్యక్తి 07 మే 2023 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. దుర్గావాహిని వారు కేరళలోని మావేలికర నగరంలో నిర్వహించిన శౌర్య యాత్ర దృశ్యాలంటూ సురేశ్ కొచ్చటిల్ ఈ వీడియోని షేర్ చేశారు.

06 మే 2023 నాడు మావేలికర నగరంలో ఇటీవల నిర్వహించిన ఈ శౌర్య యాత్రకు సంబంధించిన మరికొన్ని వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన దుర్గావాహిని సంఘం కార్యకర్తలు కేరళలో గత కొన్ని సంవత్సరాలుగా  శౌర్య యాత్రలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దుర్గావాహిని కార్యకర్తలు గతంలో నిర్వహించిన శౌర్య యాత్రలకు సంబంధించి పబ్లిష్ అయిన వీడియోలు మరియు ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. గతంలో జరిగిన దుర్గావాహిని శౌర్య యాత్రలో కూడా వందలాది మహిళలు కత్తులు, కట్టెలు పట్టుకొని ర్యాలీ మార్చ్ చేసినట్టు ఈ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలకు ముందు కూడా వందలాది మహిళలతో ఈ దుర్గావాహిని శౌర్య యాత్రలు నిర్వహించేవారు.

చివరగా, కేరళలో దుర్గావాహిని కార్యకర్తలు సాధారణంగా నిర్వహించే శౌర్య యాత్రకు సంబంధించిన వీడియోని ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో ముడిపెడుతున్నారు.   

Share.

About Author

Comments are closed.

scroll