Fake News, Telugu
 

రాజ్యాంగ ప్రతులను కాల్చేసిన కేసులో నిందితులను సుప్రీంకోర్టు దేశద్రోహులుగా గుర్తించిందన్న వార్త కల్పితం

0

దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు దీపక్ గౌడ్‌ అనే వ్యక్తిని దేశద్రోహిగా ప్రకటించి భారత పౌరసత్వాన్ని రద్దు చేసిందని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పైగా, ఇది టెర్రరిస్టుల కంటే తొమ్మిది రెట్లు తీవ్రమైన నేరమని కోర్టు అభిప్రాయపడినట్టు కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు దీపక్ గౌడ్‌ అనే వ్యక్తిని దేశద్రోహిగా ప్రకటించి భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.

ఫాక్ట్(నిజం):  2018లో కేంద్ర ప్రభుత్వం SC/ST అట్రాసిటీ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో పలు సంఘాలు నిరసనలు చేసాయి. ఈ క్రమంలోనే కొందరు రాజ్యాంగ ప్రతులను కాల్చే ప్రయత్నం చేసారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ కూడా చేసారు. ఐతే ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ సెషన్స్ కోర్టులో (కోర్టు.నెంబర్-765) విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ఈ కేసుకు సంబంధించి నిందితులు కొందరికి బెయిల్ కూడా మంజూరైంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

SC/ST అట్రాసిటీ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా ఇలా చేసారు:

కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 2018లో Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ పార్లమెంట్‌లో ఒక బిల్లును పాస్ చేసింది. అంతకు ముందు ఈ చట్టం కింద నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అరెస్టు చేయడానికి ముందు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆమోదం అవసరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు చేసింది. ఐతే ఆ తరవాత సుప్రీంకోర్టు ఈ సవరణలు రాజ్యాంగబద్దమైనవే అని తీర్పు ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణలకు వ్యతిరేకిస్తూ ఆగస్ట్ 2018లో యూత్ ఈక్వాలిటీ ఫౌండేషన్ (ఆజాద్ సేన) మరియు ఆరక్షన్ విరోధి పార్టీ అనే రెండు సంఘాలు పార్లమెంట్ స్ట్రీట్‌లో నిరసనలు చేపట్టాయి. ఈ నిరసనలో భాగంగానే  కొందరు వ్యక్తులు రాజ్యంగ ప్రతులను కాల్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు పోలీస్ విచారణలో వీరు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది:

ఐతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరక్షన్ విరోధి పార్టీ నాయకుడు దీపక్ గౌర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, పార్లిమెంట్ స్ట్రీట్‌ పోలీస్ స్టేషన్‌లో Prevention of Insults to National Honour Act, 1971 చట్టంలోని పలు సెక్షన్ల కింద మరియు Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 చట్టంలోని Section 3(u) కింద కేసు (FIR.No.75/2018) రిజిస్టర్ చేసారు.

ఐతే అక్టోబర్ 2018లో నిందితుడి దీపక్ గౌర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ఢిల్లీ సెషన్స్ కోర్టులో (కోర్టు.నెంబర్-765) విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, గత సంవత్సరం నవంబర్‌లో ఈ కేసుకు సంబంధించి క్రిషన్ మోహన్ రాయ్ మరియు అశుతోష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను విచారించడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనాను సంప్రదించగా, ఆయన దీనికి అనుమతి ఇచ్చాడు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఢిల్లీ కోర్టు గాని లేదా సుప్రీంకోర్టు గాని ఈ కేసుకు సంబంధించి ఎటువంటి తీర్పు వెల్లడించలేదు. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణ దశలోనే ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగానే ఇలాంటి తీర్పు వెల్లడించి ఉంటే, ఈ విషయానికి సంబంధించి మీడియా కథనాలు ఉండేవి, కాని మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.

పైగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ ఘటనకు సంబంధించిన నమోదైన చట్టాలు మరియు సెక్షన్లు పరిశీలిస్తే, కోర్టు వీరికి జైలు శిక్ష విధిస్తుందే తప్ప దేశద్రోహులు అని ప్రకటించి, పౌరసత్వం రద్దు చేసే ఆస్కారం లేదు. వీటన్నిటిబట్టి, ఈ కేసుకు సంబంధించి వైరల్ పోస్టులో చేస్తున్న వాదనలన్నీ కల్పితమనే అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, రాజ్యాంగ ప్రతులను కాల్చేసిన కేసులో నిందితులను సుప్రీంకోర్టు దేశద్రోహులుగా గుర్తించిందన్న వార్త కల్పితం.

Share.

About Author

Comments are closed.

scroll