Fake News, Telugu
 

అధిక వైబ్రేషన్ కలిగే పనులు చేయడం వల్ల కరోనా వైరస్ నుండి రక్షించుకోవచ్చని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

‘కోవిడ్ వైరస్ 5.5 హెర్ట్జ్ వైబ్రేషన్ కలిగి ఉంది మరియు 25.5 హెర్ట్జ్ పైన చనిపోతుంది’, కాబట్టి మనిషి ఎక్కువ వైబ్రేషన్ కలిగే పనులు చేయడం వల్ల కరోనా వైరస్ నుండి రక్షించుకోవచ్చు అని చెప్తున పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్ వైరస్ 5.5 హెర్ట్జ్ వైబ్రేషన్ కలిగి ఉంది మరియు 25.5 హెర్ట్జ్ పైన చనిపోతుంది’, కాబట్టి మనిషి అధిక వైబ్రేషన్ కలిగే పనులు చేయడం వల్ల కరోనా వైరస్ నుండి రక్షించుకోవచ్చు.

ఫాక్ట్ (నిజం): అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్ అయ్యే పనులు చేయడం ద్వారా కరోనాని నివారించొచ్చని చెప్పడానికి ప్రస్తుతానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రస్తుతం పాటిస్తున్న కరోనా చికిత్సలో ఇలాంటి పద్దతులేవి ఆచరణలో లేవు. అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్స్, అల్ట్రా సౌండ్ వేవ్స్ తో కరోనాని ఎదుర్కొనడానికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నప్పటికీ అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం మంచి విషయమే అయినప్పటికీ, కేవలం ఈ ఒక్క విషయాన్నే పాటించి కోవిడ్కి సంబంధించి ప్రభావం చూపుతున్న ఇతర పద్దతులను పాటించకపోయే ప్రమాదం ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

WHO, ICMR ఏం చెప్తున్నాయి?

అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్ అయ్యే పనులు చేయడం ద్వారా కరోనాని నివారించోచ్చని చెప్పడానికి ప్రస్తుతానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రస్తుతానికి కరోనాకి వాక్సిన్ టీకా మరియు ఇతర వైద్య పద్దతుల ద్వారా చికిత్సను అందిస్తున్నారే తప్ప పోస్టులో చెప్పినట్టు వైబ్రేషన్ థెరపీతో కాదు. ఒకవేళ ఈ వైబ్రేషన్ థెరపీ ద్వారా కరోనా నివారించగలిగితే ప్రపంచ స్థాయిలో కోవిడ్ ని పర్యవేక్షిస్తున్న  ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని లేక భారత్ లో కోవిడ్ ని పర్యవేక్షిస్తున్న ICMR వంటి సంస్థలు కోవిడ్ పేషెంట్స్ కి వైబ్రేషన్ థెరపీ సూచించేవారు, కాని ఇప్పటి వరకి WHO లేదా ICMR లేదా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ గాని ఇటువంటి సూచనలేవి చేయలేదు. పైగా ఈ వెబ్సైటులో వైబ్రేషన్ థెరపీకి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా అందుబాటులో లేదు.

గతంలో కూడా ఇదే వార్త వైరల్ అయ్యాయి

ఇంతకు ముందు కూడా ఇదే వార్త  సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు బ్రెజిల్ కి చెందిన బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ హోలిస్టిక్ థెరపిస్ట్స్ (ABRATH) ఈ వార్తలోని సమాచారం అసంపూర్తిగా ఉందని తెలిపింది. ఐతే అధిక వైబ్రేషన్ కలిగించే ప్రక్రియలు మనల్ని రక్షిస్తాయని కొన్ని అధ్యయనాలు మరియు నివేదికలు తెలుపుతున్నప్పటికీ, ఇరవై నాలుగు గంటలు ఇలా అధిక వైబ్రేషన్ కలిగించే పనులు చేయడం సాధ్యం కాదని తెలిపింది.

రాయిటర్స్ వార్తా సంస్థ కూడా ఇదే వార్త ఇతర దేశాల్లో వైరల్ అయినప్పుడు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం నిపుణులైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆఫ్ నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో శాస్త్రవేత్త అయిన ఆంటోనియో జుయారెజ్ ని సంప్రదించగా, జుయారెజ్ ఈ వైరల్ అవుతున్న వార్తలోని సమాచారం అసంపూర్తిగా ఉందని అన్నారు. మనిషి రోగనిరోధక వ్యవస్థ యొక్క బలం లేదా బలహీనతను మానసిక స్థితి మరియు శారీరక శ్రమతో ముడిపెడుతూ వివిధ అధ్యయనాలు ఉన్నప్పటికీ (ఇక్కడ మరియు ఇక్కడ ) జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటంతో కరోనా వైరస్ నుండి ఇమ్మ్యూనిటి  పొందోచ్చని చెప్పే ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

డేవిడ్ ఆర్ హాకిన్స్ సంబంధం

పోస్టులో చెప్పిన విషయానికి మూలం డేవిడ్ ఆర్ హాకిన్స్ రాసిన పవర్ vs ఫోర్సు అనే పుస్తకమని పేర్కొనడం గమనించొచ్చు. ఈ పుస్తకంలో మనిషి యొక్క వివిధ భావాలకు ఒక్కో ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ కేటాయిస్తూ ఒక టేబుల్ ని ఆయన రూపొందించాడు, ఈ టేబుల్ ని ‘మ్యాప్ అఫ్ కాంశ్యస్నెస్’ అంటారు. ఐతే వైద్య రంగానికి సంబంధించిన అకాడమిక్ పబ్లికేషన్స్ ప్రచురించే PubMedలో ఈయనకి సంబంధించి ఎటువంటి అధ్యయనం లేదు. దీన్ని బట్టి ఈయన చెప్పిన దానికి అంతగా శాస్త్రీయ గుర్తింపు లేదని అర్ధం చేసుకోవచ్చు. పైగా డేవిడ్ ఆర్ హాకిన్స్ 2012లోనే చనిపోయారు. అంటే మొదటి కరోనా కేసు వెలుగులోకి రాక ముందు. దీన్నిబట్టి ఈయన ఆ పుస్తకం రాసిన సమయంలో కరోనాని పరిగణలోకి తీసుకోలేదని అర్ధం చేసుకోవచ్చు.

కరోనాకి సంబంధించి జరుగుతున్న పరిశోధనలు:

అల్ట్రా సౌండ్ వేవ్స్, వైబ్రేషన్స్ ద్వారా కరోనా వైరస్ ని చంపే కొన్ని పరిశోధనలు జరుగుతున్న మాట నిజమైనప్పటికీ, దీనికి సంబంధించిన పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అమెరికాకి చెందిన ప్రఖ్యాత MIT విశ్వవిద్యాలయం అల్ట్రా సౌండ్ వేవ్స్ ద్వారా కరోనా వైరస్ ని చంపడానికి సంబంధించి నిర్వహించిన సిములేషన్ ప్రయోగాలలో 25 నుండి100 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ లో కరోన వైరస్ యొక్క షెల్ పగిలిపోయి కొద్ది సమయంలోనే చీలిపోయాయని కనుగొన్నారు. పైగా గాలి మరియు నీటిలో కూడా ఇదే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ లో వైరస్ చిలిపోతుందని కనుగొన్నారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం సిములేషన్ ప్రయోగం మాత్రమే, ఇంకా క్లినికల్ ట్రయల్స్ మొదలైన చాలా పరిశోధనలు చేయాల్సి ఉంది.

కరోనా వైరస్ రిసోనన్స్ ఫ్రీక్వెన్సీ కి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. స్పెయిన్ లోని సాన్ పాబ్లో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇదే విషయం పై చేస్తున్న పరిశోధనలకి సంబంధించిన పేపర్ ఇక్కడ చూడొచ్చు. ఈ పేపర్ లో కరోన వైరస్ 5.5 హెర్ట్జ్-14.5 హెర్ట్జ్ మధ్యలో తక్కువ వైబ్రేషన్ కలిగి ఉంటుందని, అధిక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇది చురుకుగా ఉండదు మరియు 25.5 Hz లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో వైరస్ చనిపోతుందని పేర్కొన్నారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ వైబ్రేషన్ ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్స్ (WAVEX) కూడా కరోనా ట్రీట్మెంట్ లో పూర్తి బాడీ వైబ్రేషన్ (WVB) యొక్క ఉపయోగంపై పరిశోధనలు చేస్తుంది.

చివరగా మనిషి చేసే ఒక్కో పనికి ఒక్కో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఉండటం, కొన్ని పనులు యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోనే విషయానికి సంబంధించి శాస్త్రీయ అధ్యయనాలు ఉన్నప్పటికీ, కరోనా వైరస్ ని ఇలా అధిక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ తో ఎదురుకోవచ్చని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటికైతే లేవు. ఆ వైపు చేసే పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఐతే పోస్టులో చెప్పినట్టు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం మంచి విషయమే అయినప్పటికీ, కేవలం ఈ ఒక్క విషయాన్నే పాటించి కోవిడ్ కి సంబంధించి ప్రభావం చూపుతున్న ఇతర పద్దతులను పాటించకపోయే ప్రమాదం ఉంది.

చివరగా అధిక వైబ్రేషన్ కలిగే పనులు చేయడం వల్ల కరోనా వైరస్ నుండి రక్షించుకోవచ్చని చెప్పడానికి ఇప్పటివరకైతే శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll