Fake News, Telugu
 

క్రైస్తవ బోధకురాలు సరళ సుజి పాస్టర్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలంటూ షేర్ చేస్తున్న ఈ కథనాన్ని ‘Way2News’ ప్రచురించలేదు

0

క్రైస్తవం పేరుతో ఆంధ్ర, తెలంగాణకు చెందిన పాస్టర్లు తనని అన్ని రకాలుగా వాడుకున్నారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రైస్తవ బోధకురాలు సరళ సుజి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తపరిచారు, అంటూ ‘Way2News’ కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది.  తన పరిస్థితే ఇలా ఉంటే, చర్చికి వచ్చే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని సరళ సుజి ప్రశ్నించినట్టు ఈ ‘Way2News’ కథనం రిపోర్ట్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: క్రైస్తవం పేరుతో ఆంధ్ర, తెలంగాణకు చెందిన పాస్టర్లు తనని అన్ని రకాలుగా వాడుకున్నారని క్రైస్తవ బోధకురాలు సరళ సుజి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తపరిచారు.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. సరళ సుజికి సంబంధించి అటువంటి వార్త ఏదీ ‘Way2News’ యాప్ పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని సరళ సుజి, ఆమె భర్త శివ కుమార్ తిరువీదుల స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన కథనానికి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, పాస్టర్లకు సంబంధించి సరళ సుజి అటువంటి ఆరోపణలు చేసినట్టు ‘Way2News’ యాప్ ఇటీవల కథనం ఏదీ పబ్లిష్ చేయలేదని తెలిసింది. సోషల్ మీడియాలో తమ లోగోలను ఉపయోగించి షేర్ చేసిన అనేక ఫేక్ కథానాల గురించి ‘Way2News’ ఇదివరకు పలు ట్వీట్లు పెట్టింది.

సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ కథనం పూర్తిగా ఫేక్ అని సరళ సుజి భర్త శివ కుమార్ తిరువీదుల 07 ఫిబ్రవరి 2023 నాడు ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. తనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని సరళ సుజి కూడా ఇటీవల ఒక  ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు.

ఈ ‘Way2News’ కథనంలో తెలిపిన సమాచారానికి సంబంధించి మరింత స్పష్టత కోసం సరళ సుజి భర్త శివ కుమార్‌ను మేము సంప్రదించాము. శివ కుమార్‌ ఈ కథనానికి సంబంధించి మాట్లాడుతూ, “ఈ కథనాన్ని ‘Way2News’ పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ కంప్లయింట్ ఇస్తున్నాము”, అని తెలిపారు. ఈ ఫేక్ ‘Way2News’ కథనానికి సంబంధించి త్వరలో ఒక వీడియో పోస్ట్ చేస్తానని శివ కుమార్‌ మాకు తెలిపారు.

Update (09 February 2023):

సోషల్ మీడియాలో తన చిత్రాలను వాడుకొని షేర్ చేస్తున్న ‘Way2News’ కథనం పూర్తిగా ఫేక్ అని సరళ సుజి 08 ఫిబ్రవరి 2023 నాడు ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. తాను మీడియాకి పాస్టర్ల గురించి తప్పుగా మాట్లాడుతూ, వారు ఉన్మాదులని, వారిపై తిరగబడాలని పిలుపునిచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని సరళ సుజి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సైబర్ కేసు పెట్టినట్టు సరళ సుజి, ఆమె కుటుంబం ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. 

చివరగా, క్రైస్తవం పేరుతో ఆంధ్ర, తెలంగాణకు చెందిన పాస్టర్లు తనని వాడుకున్నారని క్రైస్తవ బోధకురాలు సరళ సుజి పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll