Fake News, Telugu
 

2013 ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 25000 కాదు, అధికారిక గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య సుమారు 5000

0

2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల గురించి మాట్లాడుతూ ఈ వరదల కారణంగా 25,000 మంది మరణించినారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరదలు వచ్చిన నాలుగు రోజుల తర్వాత మాత్రమే సహాయక చర్యలు ప్రారంభించిందని, ఈ వరదల్లో మరణించిన వారి మృతదేహాలు తొలగింపు కోసం ప్రభుత్వం ఒక కంపెనీకి రూ. 736 కోట్లు చెల్లించింది అని చెప్తూ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 25,000, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ప్రారంభించింది, మృతదేహాల తొలగింపుకు అప్పటి ప్రభుత్వం ఒక కంపెనీకి 736 కోట్లు చెల్లించింది.

ఫాక్ట్(నిజం): నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (NIDM) 2014లో విడుదల చేసిన ఇండియన్ డిజాస్టర్ రిపోర్ట్ 2013 నివేదిక ప్రకారం, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మొత్తం 169 మంది మరణించారు, 4021 మంది తప్పిపోయారు(వీరు కూడా తరువాత చనిపోయి ఉండవచ్చని పేర్కొన్నది). అంటే, అధికారిక గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య సుమారు 5000.  16 జూన్ 2013న ఉత్తరాఖండ్‌లో వరదలు రాగానే IAF ‘ఆపరేషన్ రాహత్’ ప్రారంభించింది, వెంటనే రెస్క్యూ, రిలీఫ్‌ చర్యలో పాల్గొంది. అప్పటి ప్రధాని 19 జూన్ 2013న ఏరియల్ సర్వే నిర్వహించి రూ. 1,000 కోట్ల సహాయ నిధి మరియు బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ పోస్టు 2020 నుంచి సోషల్ మీడియాలో మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 2021లో, కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ VK సింగ్ కూడా X(ట్విట్టర్)లో 2013 ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించి ఇలాంటి కొన్ని వాదనలు చేస్తూ పోస్ట్ చేశారు.

2013 ఉత్తరాఖండ్ వరదల్లో మృతుల సంఖ్య:

జూన్ 2013లో, ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని ఘోరమైన వరదలను చూసింది. ఈ వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇంకా, ఈ విధ్వంసకరమైన ఆకస్మిక వరదలు రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు భారీ నష్టాన్ని కలిగించాయి. చోరాబరి లేక్ గ్లేసియర్ ఉప్పొంగి ప్రవహించడం వల్ల కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం బాగా దెబ్బతిన్నది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (NIDM) 2014లో విడుదల చేసిన ఇండియన్ డిజాస్టర్ రిపోర్ట్ 2013 నివేదిక ప్రకారం, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మొత్తం 169 మంది మరణించారు, 4021 మంది తప్పిపోయారు(వీరు కూడా తరువాత చనిపోయి ఉండవచ్చని పేర్కొన్నది) . సంవత్సరాలుగా, పలు మీడియా సంస్థలు కూడా ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్యను, అధికారిక గణాంకాల వెల్లడించిన మృతుల సంఖ్యకు దగ్గరగానే నివేదించాయి.(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ)

తప్పిపోయిన వారిని కూడా చనిపోయినట్లుగా పరిగణించిన కూడా మొత్తం మరణాల సంఖ్య దాదాపు 5,000 ఉంటుంది, అంటే పోస్ట్‌లో పేర్కొన్న మృతుల సంఖ్య 25,000 కంటే తక్కువే.

అప్పటి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందా?

2013 జూన్ 16న కుండపోత వర్షాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విధ్వంసక వరదలకు దారితీశాయి. 18 జూన్ 2013 నాడు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన పత్రికా ప్రకటన(ఆర్కైవ్డ్ లింక్) ప్రకారం, వరద బాధిత రాష్ట్రాల నుండి సహాయక చర్యల్లో తమ సేవలు కోరుతూ అభ్యర్థనలను వచ్చిన వెంటనే సహాయక చర్యల్లో IAF తమ సహాయం అందించిందని, రెస్క్యూ మరియు రిలీఫ్ చర్యల్లో సహాయం అందించడానికి IAF ఆపరేషన్ రాహత్‌ను ప్రారంభించిందని తెలిసింది.

18 జూన్ 2013 నాడు PMO నుండి వచ్చిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం(ఆర్కైవ్డ్ లింక్), PM మన్మోహన్ సింగ్ అప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడారని, రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లకు సంబంధించి అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది.

19 జూన్ 2013 నాడు PMO నుండి వచ్చిన ఒక పత్రికా ప్రకటన(ఆర్కైవ్డ్ లింక్) ప్రకారం,అప్పటి యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రధాని మన్మోహన్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరాఖండ్‌కు ప్రధానమంత్రి 1000 కోట్ల రూపాయల సహాయ నిధిని ప్రకటించారు, బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. ఎక్స్‌గ్రేషియా సహాయం క్రింద ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి అందించబడుతుందని. ఇంకా, ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మరియు రూ. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఒక్కొక్కరికి 50,000 అని తెలుస్తుంది.

పైన పేర్కొన్న పత్రికా ప్రకటల ఆధారంగా, అప్పటి కేంద్ర ప్రభుత్వం2013 ఉత్తరాఖండ్ వరదల్లో వేగంగానే సహాయక చర్యలను అందించింది మనం నిర్థారించవచ్చు.

అప్పటి కేంద్ర ప్రభుత్వం మృతదేహాల తొలగింపుకు రూ. 736 కోట్ల టెండర్లు పిలిచిందా?

2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన విధ్వంసకర వరదలకు అనేక భవనాలు, కొండలు కొట్టుకుపోయి వందలాది మృతదేహాలు శిథిలాల కింద కూరుకుపోయాయన్నది వాస్తవమే. అయినప్పటికీ, మృతదేహాల తొలగింపు కోసం అప్పటి ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు ఎలాంటి వార్తా నివేదికలు లేదా అధికారిక పత్రాలు మాకు లభించలేదు. ఒక వేళ అలా జరిగి అంత భారీ మొత్తంలో టెండర్లు పిలిచి ఉంటే,  పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి. అంతేకాకుండా, పైన పేర్కొన్నట్లుగా, అధికారిక మరణాల సంఖ్య సుమారు 5000 అయినప్పుడు, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న విధంగా పెద్ద మొత్తంలో టెండర్ ఉండదు.

చివరగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 25000 కాదు, అధికారిక గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య సుమారు 5000.

Share.

About Author

Comments are closed.

scroll