Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని షేర్ చేస్తూ వైకాపా MLAని ప్రశ్నించినవారి ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

“గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో గడప గడపకు జగన్ కార్యక్రమంలో భాగంగా MLA కాసు మహేశ్వర రెడ్డిని రోడ్లు బాగా లేవని ప్రశ్నించిన వారి ఇంటి మీద దాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలు”, అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: గురజాల MLA కాసు మహేశ్వర రెడ్డిని రోడ్లు బాగా లేవని ప్రశ్నించిన వారి ఇంటి మీద దాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలు

ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినవి. ఫిబ్రవరి 04న ఈ కాలేజీ విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడంతో, విద్యార్ధి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని బంధువులు వాగ్వాదానికి దిగి హాస్టల్ అద్దాలను, ఫర్నీచర్‌ని ధ్వంసం చేశారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని వివిధ వార్తా సంస్థలు ఇది వరకే ప్రసారం చేసినట్లు ఆధారాలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వార్తా కథనాల ప్రకారం, తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న విధ్యార్ధి ఫిబ్రవరి 04న అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న విధ్యార్ధి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం తమ కొడుకు మరణానికి కారణం కాలేజీ యాజమాన్యం వేధింపులేనని వారితో గొడవ పడ్డారు. హాస్టల్లో ఉన్న ఫర్నీచర్‌ని, అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గొడవని ఆపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఫాక్ట్-చెక్ విభాగం కూడా స్పష్టం చేసింది.

చివరిగా, సంబంధం లేని వీడియోని షేర్ చేస్తూ తమ MLAని ప్రశ్నించిన వారి ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడి చేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll