Fake News, Telugu
 

హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడ్డ దృశ్యాలను ప్రస్తుత హిజాబ్ నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ నిరసనల నేపథ్యంలో ‘హిజాబ్ ముసుగులో ప్రజలపైకి రాళ్లు రువ్వి అల్లర్లు సృష్టించే పురుషులైన మతోన్మాద శక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆంధ్ర, తెలంగాణ మరియు కర్నాటక పోలీసులు’ అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: హిజాబ్ ముసుగులో ప్రజలపైకి రాళ్లు రువ్వి అల్లర్లు సృష్టించే పురుషులను పోలీసులు పట్టుకున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు ఆగస్ట్ 2020లో కొందరు యువకులు తెలంగాణ నుండి ఆంధ్రకు హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ ఘటనకు సంబంధించినవి. ఈ ఘటనను అప్పట్లో అనేక మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న హిజాబ్ నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో చుపిస్తునట్టు హిజాబ్ ముసుగులో ఉన్న పురుషులను పోలీసుల అరెస్ట్ చేసింది రాళ్లు రువ్వి అల్లర్లు సృష్టించినందుకు కాదు, వీరిని అరెస్ట్ చేసింది హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నందుకు.

వీడియోకి సంబంధించి సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం వీరు తెలంగాణ నుండి ఆంధ్రాకు హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా కర్నూల్ పోలీసులు వారిని పట్టుకున్నారు, పైగా ఈ ఘటన ఆగస్ట్ 2020లో జరిగింది.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఇది మద్యం అక్రమ రవాణాకు సంబంధించిందని స్పష్టం అవుతుంది. వీటన్నిటి బట్టి ఈ వీడియోకి రాళ్లు రువ్వడానికి ఎటువంటి సంబంధంలేదని తెలుస్తుంది.

చివరగా, హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడ్డ దృశ్యాలను ప్రస్తుత హిజాబ్ నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll