చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిందంటూ ఒక వీడియోని షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): చైనా ఇటీవల కృత్రిమ సూర్యుడికి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ పరిశధన మాత్రమే జరిపింది. అంతేగాని చైనా కృత్రిమ సూర్యుడిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. ఈ పరిశోధన ద్వారా న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ సుమారు 18 నిముషాలు పాటు 158 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (70 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను అందించింది. వైరల్ ద్యుశ్యాలు ఒక రాకెట్ ప్రయోగానికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
చైనా కృత్రిమ సూర్యుడిని సృష్టించే ప్రాజెక్ట్‌ని 2006లోనే ప్రారంభించింది. దీనిని ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ లేదా కృత్రిమ సూర్యుడు అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా ఇటీవల జరిపిన పరిశధనల్లో ఈ న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ 1,056 సెకన్ల పాటు (సుమారు 18 నిముషాలు) 158 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (70 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను అందించింది. ఇది సాధారణంగా సుర్యాడు అందించే ఉష్ణోగ్రత కన్నా ఇదు రేట్లు ఎక్కువ. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే ఇటీవల జరిగింది కేవలం న్యూక్లియర్ రియాక్టర్ పరిశధన మాత్రమే, చైనా కృత్రిమ సూర్యుడిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. ఒకవేళ ఇలా జరిగి ఉంటే వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి, కాని అలాంటి రిపోర్ట్స్ ఏవి కూడా లభించలేదు. ఐతే న్యూక్లియర్ రియాక్టర్ పరిశధనకు సంబంధించిన ఈ వార్తను చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిందంటూ సంబంధంలేని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియో కూడా అలాంటిదే.
వైరల్ వీడియో?
ఈ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, చైనా ఇటీవల వేన్చంగ్ రాకెట్ ప్రయోగశాల నుండి లాంగ్ మార్చ్-7A రాకెట్ ద్వారా శియాన్- 12 01 మరియు శియాన్- 12 02 అనే రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినట్టు తెలిసింది.
ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన మరొక వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు భారీ తెల్లటి మేఘం రూపంలో విడుదలైన ఎగ్జాస్ట్ వాయువుల యొక్క రూపురేఖలు (ఆకారము), వైరల్ వీడియోలో ఎగ్జాస్ట్ వాయువుల యొక్క రూపురేఖలు (ఆకారము) ఒకేలా ఉండడం గమనించొచ్చు.
పైగా ఈ రాకెట్ ప్రయోగశాల Longlou అనే పట్టణంలో ఉంది. గూగుల్‌లో కీవర్డ్ చేయగా ఈ రాకెట్ ప్రయోగశాల దగ్గరలోని బీచ్ ఫోటోలు పబ్లిష్ చేసిన పలు వార్తా కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ) మాకు కనిపించాయి, ఈ ఫోటోలలోని లొకేషన్ వైరల్ వీడియోలోని లొకేషన్ ఒకేలా ఉండడం గమనించొచ్చు.
సాధారణంగా రాకెట్ ప్రయోగించినప్పుడు కూడా వైరల్ వీడియోలో దృశ్యాలలాగే ఒక ఫైర్‌బాల్ గాలిలోకి లేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని రాకెట్ ప్రయోగాల సందర్భంలో ఇలా జరిగిన వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే వైరల్ వీడియో ఇటీవల చైనా జరిపిన మార్చ్-7A రాకెట్ ప్రయోగానిదేనని మేము కచ్చితంగా వెరిఫై చేయలేకపోయినప్పటికి, పైన తెలిపిన వివరాల ఆధారంగా వైరల్ వీడియో చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించింది కాదని, అది ఒక రాకెట్ ప్రయోగించిన దృశ్యాలని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.
చివరగా, అంతరిక్షంలోకి రాకెట్‌ని ప్రవేశపెట్టిన దృశ్యాలను, చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిందంటూ షేర్ చేస్తున్నారు.