Fake News, Telugu
 

2018లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన వీడియోని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఉండే హనుమంతుని ఆలయంలోనికి అన్య మతస్తులు వచ్చి అపవిత్రమైన పనులు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, హనుమంతుడి విగ్రహంపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట ప్రాంతంలో ఇటీవల జరిగిందని, ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా నిందితుడిని పట్టుకోవచ్చని చెప్తూ ఆ పోస్టు సారాంశంలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల హైదరాబాద్‌లోని శామీర్‌పేట ప్రాంతంలో హనుమంతుని విగ్రహంపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ ఘటన అక్టోబర్ 2018లో ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలోని బర్నహల్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడైన అర్జున్ సింగ్ జాతవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను కించపరిచేలా ప్రవర్తించాడని వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో అతనికి బెయిలు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో 20 అక్టోబర్ 2018 లోనే యూట్యూబ్‌లో అప్‌లోడు చేయబడినట్లు గుర్తించాం.

అయితే ఈ సంఘటన జరిగిన ప్రదేశం గురించి ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో, మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఘటన అక్టోబర్ 2018లో ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలోని బర్నహల్ ప్రాంతంలో జరిగినట్లు గుర్తించాం.

గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనకు బాధ్యులైన అర్జున్ సింగ్ జాతవ్, ధరం సింగ్ అనబడే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇక నిందితుడైన అర్జున్ సింగ్ జాతవ్ పై ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను కించపరిచేలా ప్రవర్తించాడని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, 2018లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన వీడియోని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll