పరమహంస కొలిచిన ప్రపంచ ప్రసిద్ధ కోల్‌కతా కాళీ మాత గుడిలో పూజలు నిలిపివేసి వెంటనే దేవాలయాన్ని మూసివేయాలని అక్కడి ముస్లింలు గొడవ చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోల్‌కతా కాళీ మాత గుడిలో పూజలు నిలిపివేసి వెంటనే దేవాలయాన్ని మూసివేయాలని అక్కడి ముస్లింలు గొడవ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఫెని నగరంలో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందువులు ఫెని నగరంలో భారీ నిరసన చేపట్టారు. హిందువులు చేపట్టిన ఈ నిరసనను వ్యతిరేకిస్తూ అక్కడి ముస్లింలు ఇస్లాం నినాదాలు చేస్తూ హిందువులతో గొడవ పడ్డారు. ఈ వీడియోలోని ఘటన కోల్‌కతా కాళీ మాత మందిరం ముందు చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన స్పష్టమైన వీడియోని ‘Hobby Travel’ అనే యుట్యూబ్ ఛానల్ 16 అక్టోబర్ 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. బంగ్లాదేశ్ ఫెని నగరంలో హిందూవులు ముస్లింలు గొడవ పడుతున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోలోని 2:30 నిమిషాల దగ్గర ఒక వ్యక్తి వాయిస్ ఓవర్ ఇస్తూ, ఫెని నగరంలో హిందూ ముస్లింలు గొడవ పడుతున్నారని చెప్పారు.
ఈ వీడియోని ఇదే వివరణతో పలు బంగ్లాదేశ్ మీడియా ఛానల్స్ మరియు యూట్యూబ్ యూసర్లు షేర్ చేసారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలలో కనిపిస్తున్న ఒక హోర్డింగ్ పై ‘BASIC Bank Limited’ (బెంగాలీ భాషలో రాసి ఉన్న అక్షరాలని అనువాదం చేసి చూస్తే తెలిసింది) అని రాసి ఉంది. ‘BASIC Bank Limited’ అనేది బంగ్లాదేశ్‌కు చెందిన బ్యాంక్ సంస్థ. దీన్ని బట్టి, పోస్టులోని వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించిందని చెప్పవచ్చు.
ఫెని నగరంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణకు సంబంధించి ‘News Bangla 24,com’ న్యూస్ సంస్థ 18 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్‌లో తెలిపిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందువులు 16 అక్టోబర్ 2021 ఫెని నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హిందువులు, ఫెని నగరంలోని బర జామే మసీదు సమీపంలో ఉన్న సెంట్రల్ కాళీబరి (కాళీ మాత దేవాలయం) ముందు నిరసన చేపట్టారు. ప్రార్ధన ముగించుకొని మసీదు బయటికి వచ్చిన ముస్లింలకు హిందూ నిరసనకారుల మధ్య గొడవ చోటుచేసుకున్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఘర్షణలో భాగంగా 29 మంది గాయపడినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఘర్షణకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని వీడియోలు మరియు ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో బంగ్లాదేశ్ హిందూ-ముస్లిం ఘర్షణలకు సంబంధించిన వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, బంగ్లాదేశ్ హిందూ-ముస్లిం ఘర్షణలకు సంబంధించిన వీడియోని కోల్‌కతా కాళీ మాత గుడి ముందు ముస్లింలు గొడవ చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.