Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడి వీడియోని పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మండపంపై దాడి అంటూ షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మాత మండపాలపై ముస్లింల దాడి అంటూ, కొందరు ముస్లిం వ్యక్తులు రాళ్ళు విసురుతున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మాత మండపాలపై ముస్లింలు దాడి చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని చంద్‌పూర్‌లో హిందూ దేవాలయంపై అక్కడి ముస్లింలు దాడి చేసిన ఘటనకు సంబంధించింది. ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ నిడివిగల వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది అప్లోడ్ చేసారు. అలాగే ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ని పలు వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో కుడివైపు కింది భాగాన ‘THE BITE’ అనే లోగో స్పష్టంగా కనిపిస్తుంది. దీని ఆధారంగా ట్విట్టర్‌లో వెతకగా ఇదే పేరుతో ఉన్న అకౌంట్‌లో ఈ వీడియోని షేర్ చేసిన ట్వీట్ కనిపించింది. ఐతే ఈ ట్వీట్‌లో పేర్కొన్న వివరణ ప్రకారం ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని చంద్‌పూర్‌లో దుర్గా మండపంపై ముస్లింలు దాడి చేసిన ఘటనకు సంబంధించింది.

పైన తెలిపిన వివరాల ఆధారంగా ఫేస్‌బుక్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా వైరల్ వీడియో యొక్క వేరే వెర్షన్‌ని (ఎక్కువ నిడివి) షేర్ చేసిన పలు సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) మాకు కనిపించాయి. ఈ వీడియోలలో కనిపిస్తున్నదాని ప్రకారం ముస్లింల వ్యక్తులు రాళ్ళు విసురుతున్నది ఒక దుర్గా మండపంపైన. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో జరిగినట్టు వీడియోకి సంబంధించిన వివరణలో పేర్కొన్నారు. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేసిన వీడియోలో దుర్గా మండపం కనపడకుండా ట్రిమ్ చేసినట్టు అర్ధమవుతుంది.

పైన తెలిపిన వివరాల ఆధారంగా ఈ  దాడులకు సంబంధించిన వార్తా కథనాల కోసం వెతకగా, వైరల్ వీడియోలోని విజువల్స్‌ని పోలిన ఫోటోని ప్రచురించిన లోకల్ బంగ్లాదేశీ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం వైరల్ అవుతున్న వీడియో చంద్‌పూర్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడికి సంబంధించింది. ‘కొమిల్లాలో జరిగిన సంఘటన తర్వాత, అక్టోబర్ 13 రాత్రి 8 గంటల తర్వాత హజిగంజ్ బజార్‌లోని శ్రీ శ్రీ లక్ష్మి-నారాయణ్ జియు అఖ్రా మరియు సమీపంలోని రామకృష్ణ మిషన్ ఆలయంపై యువకుల బృందం దాడి చేసింది. పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, పోలీసులకు మరియు నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది.’  అని ఈ కథనంలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్, కుమిల్లాలో దుర్గా పూజ వేడుకల సందర్భంగా ఖురాన్‌ను అపవిత్రం చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా వ్యాపించడంతో అక్కడి ముస్లింలు హిందు దేవాలయలు, దుర్గా మండపాలపై దాడి చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్‌పూర్‌లోని హిందూ దేవాలయంపై కూడా దాడులు జరిగాయి, చంద్‌పూర్‌లో జరిగిన ఈ దాడులను రిపోర్ట్ చేసిన లోకల్ బంగ్లాదేశీ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులకు సంబంధించి భారత మీడియా రిపోర్ట్ చేసిన కథనాలలో చంద్‌పూర్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్‌ని కూడా ప్రసారం చేసారు. ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చూడొచ్చు. పైగా పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మండపాలపై ముస్లింలు దాడి చేసినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ కూడా లేవు. దీన్నిబట్టి పోస్టులోని వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిందని, ఈ వీడియోకి బెంగాల్‌కి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్‌లో దుర్గా మండపంపై  దాడి అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll