Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్ గురించిన పాఠ్యాంశం 10వ తరగతి తెలుగు పుస్తకాలలో లేదు

0

10వ తరగతి తెలుగు పుస్తకాలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి పాఠాలు ప్రవేశపెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మరియు జనసేన పార్టీ అజెండాను వివరిస్తూ ప్రచురించిన ఒక పుస్తక కథనం స్క్రీన్ షాట్‌ని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: 10వ తరగతి తెలుగు పుస్తకాలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి పాఠం ప్రవేశపెట్టారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, ‘ఆధునిక మహాభారతం 2017’ ఎడిషన్‌లో ప్రచురించిన కథనాన్ని చూపిస్తుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 10 తరగతి పాఠ్య పుస్తకాలలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ప్రవేశ పెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను ప్రవేశపెట్టినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదని తెలిసింది. TSSCERT మరియు APSCERT పబ్లిష్ చేసిన 10వ తరగతి పాఠ్య పుస్తకాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన సమాచారం కోసం వెతకగా, ఇదే ఫోటోని జనసేన పెందుర్తి అధికారిక ఫేస్ బుక్ పేజీ 20 అక్టోబర్ 2020 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి తెలుపుతూ ప్రచురించిన కథనమని ఈ పోస్టు వివరణలో తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కథనంలో, “జనసేన పార్టీ అజెండాలోని అంశాలన్నీ “కవి సేన” కవి శేషేంద్ర “ఆధునిక మహాభారతం” పుటల్లోంచి తీసుకున్నవే! అందుకే పవన్ కళ్యాణ్ “డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ తనకు ఇష్టమైన కవి” అని సభాముఖంగా ప్రకటించారు”, అని తెలిపారు.

శేషేంద్ర శర్మ రచించిన “ఆధునిక మహాభారతం” గ్రంధాన్ని 2017లో రిప్రింట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆర్ధికంగా సహాయం చేసారు. అంతేకాదు, “ఆధునిక మహాభారతం 2017” ఎడిషన్‌లో పవన్ కళ్యాణ్ “ఆధునిక మహాభారతం” పై తనకు ఉన్న అభిప్రాయాన్ని పంచుకున్నట్టు పలు ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. “ఆధునిక మహాభారతం” పాత ఎడిషన్ పుస్తకాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ‘ఆధునిక మహాభారతం’ పుస్తకంలో ప్రచురించిన కథనమని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, కర్ణాటక ప్రభుత్వం పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టారని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, దానికి సంబంధించి FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, ‘ఆధునిక మహాభారతం’ పుస్తకంలో ప్రచురించిన కథనాన్ని 10వ తరగతి తెలుగు పుస్తకాలలో పవన్ కళ్యాణ్ గురించి ప్రచురించిన కథనంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll