Fake News, Telugu
 

స్నాతకోత్సవ సమయంలో విద్యార్థులు కాషాయ రంగుతో పాటు ఇతర రంగుల వస్త్రాలను కూడా ధరించారు

0

కాన్వొకేషన్‌కు బ్రిటీష్ సాంప్రదాయ నల్ల గౌనుతో కాకుండా, కాషాయ వస్త్రధారణతో హాజరైన విద్యార్థినిలు’ అంటూ కుర్తాలు, కాషాయ కండువాలు ధరించి ఆడిటోరియంలో కూర్చున్న విద్యార్థుల ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: స్నాతకోత్సవంలో బ్రిటీష్ సాంప్రదాయ నల్ల గౌనుతో కాకుండా, కాషాయ వస్త్రధారణతో హాజరైన విద్యార్థుల ఫోటో.

ఫాక్ట్ (నిజం): గత కొన్ని సంవత్సరాల నుండి చాలా యూనివర్సిటీల్లో స్నాతకోత్సవం సమయంలో ఇంతకు ముందు వాడే నల్ల గౌన్లకు బదులు సంప్రదాయ దుస్తులను వాడుతున్నారు. ఐతే ఈ వస్త్రాల విషయంలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. వైరల్ పోస్టులో ప్రస్తావించిన స్నాతకోత్సవంలో విద్యార్థులు ఇతర రంగు దుస్తులు కూడా ధరించారు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని ప్రచురించిన మార్చ్ 2021 కథనం ఒకటి మాకు కనిపించింది. డెహ్రాడూన్‌లోని ఉత్తరాంచల్ యూనివర్సిటీ, స్నాతకోత్సవంలో విద్యార్థులు నల్ల గౌన్ ధరించే  సంప్రదాయానికి స్వస్తి చెప్తూ, భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించే పద్దతిని మొదలుపెట్టారని ఆ కథనం సారాంశం.

ఈ కథనం ఆధారంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెబ్సైటులో వెతకగా 2020లో జరిగిన స్నాతకోత్సవంకు సంబంధించిన ఫోటోలు కనిపించాయి. ఈ ఫోటోలలో విద్యార్థులందరూ గోదమ రంగు కుర్తా ధరించగా, పైన బ్లూ లేదా మెరూన్ లేదా కాషాయ రంగు స్కార్ఫ్స్ ధరించినట్టు స్పష్టమవుతుంది.

ఈ విషయం స్పష్టత కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, 2017లో ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ స్నాతకోత్సవానికి హాజరైన అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నల్ల గౌను ధరించడానికి నిరాకరించిన వార్తను రిపోర్ట్ చేసిన ఒక కథనం కనిపించింది. ఇకమీదట ఇలాంటి సందర్భాల్లో గౌన్స్ కాకుండా రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబిచేలా దుస్తులు వేసుకోనేలా ఆదేశిస్తామని ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అన్నారు.

ఐతే ఈ ఫోటో గతంలో కూడా వైరల్ అయినప్పుడు BOOM అనే ఫాక్ట్-చెకింగ్ ఏజెన్సీ ఈ ఫోటోకి సంబంధించి వివరణ కోసం ఉత్తరాంచల్ యూనివర్సిటీని సంప్రదించగా ‘ఉత్తరాఖండ్ యూనివర్శిటీలన్నీ నల్ల గౌన్లు కాకుండా సంప్రదాయ దుస్తుల్లోనే స్నాతకోత్సవాన్ని నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాల మేరకు ఇలా చేసామని. ఒక్కో డిపార్టుమెంట్ విద్యార్థులు ఒక్కో రంగు స్కార్ఫ్స్ ధరించారని తెలిపారు.’

 చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసి చేనేత కార్మికుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో సూచించిన చేనేత వస్త్రాలతో నేసిన దుస్తుల వాడాలని కోరుతూ 2015లోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని యూనివర్సిటీలకి  సర్కులర్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే దేశంలోని చాలా యూనివర్సిటీలు కొన్ని సంవత్సరాలుగా స్నాతకోత్సవ సమయంలో ఇంతకుముందు వాడే నల్ల గౌనుకు బదులు సంప్రదాయ దుస్తులను వాడటం మొదలుపెట్టారు. ఉదాహరణకి ఐఐటి హైదరాబాద్ కొన్ని సంవత్సరాల క్రితం నుండి  స్నాతకోత్సవ సమయంలో భారతీయ సాంప్రదాయ దుస్తులనే వాడుతుంది, దీనికి సంబంధించిన వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఇలా స్నాతకోత్సవం మొదలైన సమయాల్లో సంప్రదాయ దుస్తులు వాడుతున్నప్పటికీ, దీంట్లో మత పరమైన కోణం ఏది లేదు. అన్ని రంగుల సంప్రదాయ దుస్తులను స్నాతకోత్సవాలలో వాడుతున్నారు.

చివరగా, స్నాతకోత్సవ సమయంలో విద్యార్థులు కాషాయ రంగుతో పాటు ఇతర రంగుల వస్త్రాలను కూడా ధరించారు.

Share.

About Author

Comments are closed.

scroll