Fake News, Telugu
 

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020’ ర్యాంకులను పాత ర్యాంకులతో తమకు నచ్చినట్టుగా పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

0

తాజాగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020’ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిచడంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విశాఖపట్నం, విజయవాడ, మరియు తిరుపతి కి మంచి ర్యాంకులు వచ్చేవని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నగరాల ర్యాంకులు చాలా పడిపోయాయని చెప్తూ ఒక పోస్ట్ ని కొందరు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018’ లో విశాఖపట్నంకి 7వ ర్యాంకు రాగా, జగన్ ప్రభుత్వంలో ఆ ర్యాంకు (‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో) 17కి పడిపోయింది.

ఫాక్ట్ (నిజం): ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018’ లో విశాఖపట్నంకి 7 వ ర్యాంకు వచ్చిన మాట వాస్తవమే, అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ లో విశాఖపట్నం ర్యాంకు 23 కి పడిపోయింది. ఇప్పుడు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో ఆ ర్యాంకు 17కి వచ్చింది. అంటే, జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ర్యాంకు మెరుగుపడింది. కావున పోస్ట్ లో 2019 ర్యాంకు చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో ఇచ్చిన టేబుల్ లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ ర్యాంకులు ఇవ్వలేదని చూడవొచ్చు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018’ లో విశాఖపట్నం కి 7వ ర్యాంకు వచ్చిన మాట వాస్తవమే, అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ లో విశాఖపట్నం ర్యాంకు 23కి పడిపోయింది. ఇప్పుడు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో ఆ ర్యాంకు 17కి వచ్చింది. అంటే, జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ర్యాంకు మెరుగుపడింది. పోస్ట్ లో చెప్పినట్టు పడిపోలేదు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల ర్యాంకులు జగన్ ప్రభుత్వ హయంలో పడిపోయాయని జనవరి 2020 లో నారా లోకేష్ ట్వీట్ చేస్తే, అది తప్పు అని,  ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ సర్వే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్వహించారని, ఆ ర్యాంకులు కూడా మార్చి 2019 లోనే విడుదల చేసారని FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

20 ఆగస్టు 2020 న ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ ర్యాంకుల పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ (ఆర్కైవ్డ్) చేసాడు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ లో 23 వ ర్యాంకులో ఉన్న విశాఖపట్నం, ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో 9 వ ర్యాంకుకి వచ్చిందని ట్వీట్ చేసాడు.

కానీ, ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019’ లో విశాఖపట్నం కి 23వ ర్యాంకు ‘లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల’ లిస్టులో వచ్చింది. అదే లిస్టు లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో విశాఖపట్నం కి 17వ ర్యాంకు వచ్చింది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020’ లో ‘పది లక్షలకి పైగా జనాభా ఉన్న నగరాల’ లిస్టులో విశాఖపట్నంకి 9వ ర్యాంకు వచ్చింది. కావున, రెండు వేరు వేరు లిస్టులలో విశాఖపట్నం కి వచ్చిన ర్యాంకులను పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.

చివరగా, ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020’ ర్యాంకులను పాత ర్యాంకులతో తమకు నచ్చినట్టుగా పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll