రోడ్డు పక్కన పడి ఉన్న ఒక సూట్‌కేసులో ఒక అమ్మాయి మృతదేహం లభ్యమయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. సూట్‌కేసులో ఉన్న మృతదేహం ఒక హిందూ అమ్మాయిదని, ఒక ముస్లిం వ్యక్తి ఆమెని చంపేసి ఇలా సూట్‌కేసులో పెట్టాడని అర్ధం వచ్చేలా “డైలీ చూస్తున్న మన హిందూ అమ్మాయిలకి బుద్ధి ఎందుకు రావటం లేదు” అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని చంపి సూట్‌కేసులో పెట్టిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022 అక్టోబర్‌లో హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఘటనకు సంబంధించింది. ఈ ఘటనలో నిందితుడి హిందువే. ఒక ప్రైవేట్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్న రాహుల్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకతో గొడవపడి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్ చేసి పొదల్లో పడేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
సూట్‌కేసులో అమ్మాయి మృతదేహం లభ్యమయిన ఈ ఘటన గురుగ్రామ్, హర్యానాలో 2022 అక్టోబర్‌లో జరిగింది. పైగా ఈ ఘటనలో లవ్ జిహాద్/హిందూ-ముస్లిం కోణమేది లేదు.
వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను అక్టోబర్ 2022లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం పోలీసులకు గురుగ్రామ్‌లోని ఇఫ్కో చౌక్ రోడ్డు సమీపంలో సూట్‌కేసులో ఒక మహిళ మృతదేహం లభించింది.
ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ ఘటనలో హిందూ- ముస్లిం కోణమేది లేదు. ఈ ఘటనకు సంబంధించిన మరొక కథనం ప్రకారం గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్న రాహుల్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకతో గొడవపడి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్ చేసి పొదల్లో పడేసాడు.
ఈ కేసుకు సంబంధించిన FIR ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వివరాల బట్టి ఈ ఘటనలో హిందూ-ముస్లిం కోణమేది లేదని స్పష్టమవుతుంది.
చివరగా, సూట్‌కేసులో అమ్మాయి మృతదేహం లభ్యమయిన ఈ ఘటనలో హిందూ-ముస్లిం కోణమేది లేదు.