Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని టీ.టీ.డీ అర్చకుడి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న బంగారం మరియు నగదు అని షేర్ చేస్తున్నారు

0

తిరుమల తిరుపతి దేవస్థానంలోని 16 మంది అర్చకులలో ఒక అర్చకుడి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీ నిర్వహించి 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 77 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుందని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్టు షేర్ అవుతుంది. ఇదే క్లెయింతో మరొక ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీ నిర్వహించి స్వాధీనం చేసుకున్న బంగారం మరియు నగదు యొక్క ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మొదటి మరియు చివరి ఫోటోలు, ఉత్తరప్రదేశ్ వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో DGGI అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న నగదు మరియు బంగారం దృశ్యాలు. ఇక రెండో ఫోటో, తమిళనాడు వెల్లూరులో ఒక బంగారం షాపు నుండి అపహరించిన ఆభరణాలను పోలీసులు పట్టుకొని మీడియా ముందుకు తీసుకొచ్చిన దృశ్యాలని చుపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీ నిర్వహించినట్టు ఇటీవల ఎటువంటి వార్తలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

ఈ పోస్టులో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించిన వివరాల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ఫోటో 1 & 3:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘ది హిందూ’ వార్తా సంస్థ 27 డిసెంబర్ 2021 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టీ ఇంటలిజెన్స్ (DGGI) అధికారులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం మరియు నగదు యొక్క దృశ్యాలంటూ ఈ ట్వీట్లో తెలిపారు. పియూష్ జైన్ యొక్క ఒడోచెం ఇండస్ట్రీస్ ఆహ్మదబాద్ యూనిట్లో DGGI అధికారులు తనిఖీ నిర్వహించి 23 కేజీల బంగారం, 17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈ ట్వీట్లో తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో కాన్పూర్‌ వ్యాపారి పియూష్ జైన్‌కు సంబంధించిన వ్యాపారాలు, పలు నివాసాలలో జిఎస్‌టీ ఇంటలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి సుమారు 194 కోట్ల నగదు, 23 కేజీల బంగారం నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

మరొక పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా పియూష్ జైన్ రైడ్‌కు సంబంధించిందే అని తెలిసింది. పియూష్ జైన్ రైడ్‌కు సంబంధించి ఈ ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫోటో 2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని తమిళ న్యూస్ ఛానల్ ‘Jaya Tv’ 22 డిసెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో తమిళనాడు వెల్లూరు పట్టణంలో ఇటీవల జరిగిన ఒక నగల దోపిడీకి సంబంధించినదని తెలిసింది. 14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలని ముసుగు ధరించి వచ్చిన ఒక దొంగ దోచుకొని వెళ్ళాడు. తమిళనాడు పోలీసులు కోల్పోయిన ఆభరణాలన్నింటినీ స్వాధీనం చేసుకుని నిందితుడు దీకరమన్‌ను అరెస్టు చేశారు. పట్టుబడిన ఆభరణాలని పోలీసులు మీడియాకి చూపిస్తున్నప్పుడు ఈ ఫోటో తీసారు.

వెల్లూరులో జరిగిన ఈ నగదు దోపిడీకి సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఇదివరకు, ఈ ఫోటోని టీటీడీ ట్రస్ట్ సభ్యుడు జె.శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దాని సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడి ఇంటిపై  ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖి నిర్వహించి నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎటువంటి వార్త పబ్లిష్ అవ్వలేదు. అయితే, 2016లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్‌ రెడ్డి నివాసాలపై తనిఖీ నిర్వహించి ₹100 కోట్ల నగదు, 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐటి దాడుల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శేఖర్‌ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా తొలగించింది. శేఖర్‌ రెడ్డిపై సీబీఐ కేసును దాఖలు చేసిన తరువాత సాక్ష్యాలు లేనందున ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 2020లో కొట్టివేసింది. తనపై ఆరోప బడిన కేసులని కోర్టు  కొట్టిపారేయడంతో, శేఖర్‌ రెడ్డి తిరిగి టీటీడీ బోర్డులో చేరారు. అయితే, ఆగస్టు 2021లో ఏర్పాటు చేసిన కొత్త టీటీడీ బోర్డులో అతన్ని చేర్చలేదు. 2016లో జరిగిన ఐటి దాడుల దాడులకు సంబంధించి ఈ.డి. నమోదు చేసిన కేసు ఇంకా విచారణలోనే ఉంది.

చివరగా, సంబంధం లేని ఫోటోలని తిరుపతి దేవస్థానం అర్చకుడి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll