Fake News, Telugu
 

నగల దోపిడీకి సంబంధించిన వీడియోను టీటీడీ బోర్డు సభ్యుడిపై జరిగిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగలు అని షేర్ చేస్తున్నారు

0

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఒకరి ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.ఈ దాడుల్లో 128కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కోట్లు విలువ చేసే వజ్రాలు దొరికాయని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిపై ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో తమిళనాడులోని వెల్లూరులో ఇటీవల జరిగిన నగల దోపిడీకి సంబంధించినది. 14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలు దోచుకున్నారు. తమిళనాడు పోలీసులు కోల్పోయిన ఆభరణాలన్నింటినీ స్వాధీనం చేసుకుని నిందితుడు దీకరమన్ ను అరెస్టు చేశారు. ఇకపోతే, 2016లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు జే.శేఖర్‌ రెడ్డి నివాసాలపై దాడి చేసి ₹100 కోట్ల నగదు, 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, శేఖర్‌ రెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన కేసును సాక్ష్యాలు లేనందున ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 2020లో కొట్టివేసింది. కేసులు మూసివేసినప్పుడు శేఖర్‌ రెడ్డి తిరిగి టీటీడీ బోర్డులో చేరారు. అయితే, ఆగస్టు 2021లో ఏర్పాటు చేసిన కొత్త టీటీడీ బోర్డులో అతను లేడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. జయా ప్లస్ ఛానల్‌లో 22 డిసెంబర్ 2021న ఈ వీడియో అప్లోడ్ చేసారు. తమిళనాడులోని వెల్లూరులో జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి ఇటీవల దోచుకున్న బంగారాన్ని తిరిగి స్వాధీనంచేసుకున్నట్టు ఈ వీడియోలో తెలిపారు.ఇటువంటి విజువల్స్‌తో అదే సంఘటనను మరో రెండు న్యూస్ ఛానల్స్ యూట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలను దోచుకున్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు వెల్లూరులోని ఒక శ్మశానవాటికలో దొంగిలించిన ఆభరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి బంగారం, వజ్రాలను దోచుకున్న డీకరమన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇకపోతే, 2016లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అప్పటి టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్‌ రెడ్డి నివాసాలపై దాడి చేసి ఆయన ఇళ్ల నుంచి ₹100 కోట్ల నగదు, 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐటి దాడుల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శేఖర్‌ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా తొలగించింది. శేఖర్‌ రెడ్డిపై సీబీఐ కేసును దాఖలు చేసిన తరువాత సాక్ష్యాలు లేనందున ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 2020లో కొట్టివేసింది. కేసులు మూసివేసినప్పుడు శేఖర్‌ రెడ్డి తిరిగి టీటీడీ బోర్డులో చేరారు. అయితే, ఆగస్టు 2021లో ఏర్పాటు చేసిన కొత్త టీటీడీ బోర్డులో అతన్ని చేర్చలేదు. 2016లో జరిగిన ఐటి దాడుల దాడులకు సంబంధించి ఈ.డి. నమోదు చేసిన కేసు ఇంకా విచారణలోనే ఉంది.

ఇటీవల, ఆదాయపు పన్ను శాఖ ఒక టీటీడీ సభ్యుడిపై దాడి చేసిందని పేర్కొన్న ఇలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, FACTLY దాన్ని ఫాక్ట్-చెక్ చేసి రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, వెల్లూరులో జరిగిన నగల దోపిడీకి సంబంధించిన వీడియోను టీటీడీ బోర్డు సభ్యుడిపై జరిగిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగలు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll