‘పది రూపాయల గాలిపటం కోసం పరిగెత్తిన ఈ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, *పిల్లలు తస్మాత్ జాగ్రత్త !’ అని పిల్లల్ని హెచ్చరిస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో ఉన్న వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ కారు ఢీకొట్టి పడిపోతాడు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: గాలిపటం కోసం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టి మృతిచెందిన ఓ వ్యక్తి వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): పోస్టులో దృశ్యాలు 2018లో గుజరాత్‌లోని పాలన్ పూర్-డీశా హైవే పై జరిగిన ఒక సంఘటనవి. న్యూస్ రిపోర్టుల ప్రకారం, రాజుభాయ్ ఠాకూర్ అనే యువకుడు, పరిగెడుతూ రోడ్డు దాటుతుండగా హఠాత్తుగా ఒక ఇన్నోవా కారుకి ఢీకొని గాల్లో సుమారు 20 అడుగులు ఎగిరి పడి అక్కడికి అక్కడే మృతి చెందాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చెప్తున్నట్లు ఈ వీడియోలో సంఘటన గురించి ఏవైనా వార్తా కథనాలు ఉన్నాయా అని ఇంటర్నెట్‌లో వెతకగా, ఎటువంటి సంబంధిత వార్త కథనాలు లభించలేదు. వీడియోకి సంబంధించి సమాచారం కొరకు సరైన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వీడియోతో ‘Aaj Tak’ వారి ఒక ఫేస్బుక్ పోస్టు లభించింది. 2018 నాటి ఈ పోస్టు టైటిల్ బట్టి ఈ సంఘటన పాలన్ పూర్-డీశా రోడ్డుపైన జరిగిందని తెలిసింది. ఈ సంఘటనపై వార్త కథనాలు కుడా ప్రచురితమయ్యాయి.
ఈ వార్తా కథనాల ప్రకారం, 2018లో రాజుభాయ్ ఠాకూర్ అనే యువకుడు గుజరాత్‌లోని జోధనాపుర దెగ్గర పాలన్ పూర్-డీశా రహదారి దాటుతున్నపుడు ఒక కారును ఢీకొని మరణించాడు. ఈ సంఘటనపై ప్రచురితమైన వార్త కథనాల్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల్లో ఎక్కడ కుడా ఆ యువకుడు గాలిపటం కోసం రోడ్డు దాటుతూ మృతి చెందాడు అని ప్రస్తావించలేదు.
చివరిగా, 2018లో గుజరాత్‌లో జరిగిన సంఘటనని ఇటీవల ఒక వ్యక్తి గాలిపటం కోసం రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొట్టి మరణించిన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.