Fake News, Telugu
 

14 ఏళ్ళ పాత వీడియోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవులపై దాడి దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు

0

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులపై హిందూవులు అతి కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. క్రైస్తవ మతాన్ని విడిచి హిందూ మతంలోకి చేరాలని ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని ఆదివాసుల గుంపు అక్కడి క్రైస్తవుల ఇళ్లపై దాడి చేసారంటూ ఒక వీడియో లింకుని ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఆ  పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవులపై హిందూవులు అతి కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2008 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. 2008 జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఒక క్రైస్తవ సభపై 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు వార్తలున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవ గిరిజనులపై దాడులు జరిగిన వాస్తవమే అయినప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో చాలా పాతది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు. ఈ వీడియోకి సంబంధించి ఇంటర్నెట్లో వెతికితే, ఇదే వీడియోని చాలా మంది యూసర్లు 2008 నుండి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషద్‌కు సంబంధించిన వ్యక్తులు ఒక క్రైస్తవ సభపై దాడి చేసిన దృశ్యలంటూ ఒక యూట్యూబ్ యూసర్ ఈ వీడియోని 2008 జనవరి నెలలో షేర్ చేశారు.

వీడియోలోని ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాల కోసం వెతికితే, 2008 జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక క్రైస్తవ సభపై జరిగిన దాడికి సంబంధించి ‘BBC’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భొట్లీ గ్రామంలో జరిగిన ఒక క్రైస్తవ సభపై 100కు పైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, క్రైస్తవులను కొట్టి, క్యాంపుని తగలపెట్టినట్టు ‘BBC’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. పోస్టులో షేర్ చేసిన IBN7 న్యూస్ వీడియో స్క్రోలింగ్ లో కూడా ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు రిపోర్ట్ చేశారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఇటీవల క్రైస్తవ గిరిజనులపై దాడి జరిగినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. 2023 జనవరి మొదటి వారంలో మతమార్పిడి పేరుతో క్రైస్తవులపై జరిగిన దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన స్పష్టమైన సమాచారం తెలియనప్పటికీ, ఈ వీడియో పాతది అని, ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ గిరిజనులపై జరిగిన దాడిని సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 14 ఏళ్ళ పాత వీడియోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవ గిరిజనులపై దాడి దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll