Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కేటీఆర్ భార్య శైలిమ కేసీఆర్‌ను పట్టుకొని ఏడ్చిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

0

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ భార్య శైలిమ కేసీఆర్‌ను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసిన చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. భావోద్వేగంతో ఏడుస్తున్న భార్య, కొడుకుని కేటీఆర్ ఓదారుస్తున్న చిత్రమంటూ మరో ఫోటోని కూడా ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేటీఆర్ భార్య శైలిమ కేసీఆర్‌ను పట్టుకొని ఏడ్చిన చిత్రం.

ఫాక్ట్ (నిజం): 2022 డిసెంబర్ నెలలో శైలిమ తండ్రి హరనాథరావు మృతి తరువాత కేసీఆర్‌ హరనాథరావు ఇంటికి వెళ్ళి శైలిమను ఓదార్చిన చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. తండ్రి చనిపోయిన భావోద్వేగంలో ఏడుస్తున్న భార్యను కేటీఆర్ ఓదారుస్తున్న చిత్రాన్ని మరో ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలు  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తీసినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇదే చిత్రాన్ని థంబ్‌నెయిల్‌ ఫోటోగా పెట్టి Daily Culture యూట్యూబ్ ఛానెల్ 29 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసిన వీడియో దొరికింది. కేటీఆర్ భార్య శైలిమ, తండ్రి మరణంతో భావోద్వేగంతో ఏడుస్తుంటే, కేసీఆర్‌ ఆమెను ఓదారుస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.

2022 డిసెంబర్ నెలలో కేటీఆర్ మామ హరనాథరావు మృతి తరువాత కేసీఆర్‌ హరనాథరావు ఇంటికి వెళ్ళి హరనాథరావు కుటుంబాన్ని పరామర్శించి, కోడలు శైలిమను ఓదార్చారు. కేసీఆర్‌, కేటీఆర్ శైలిమను ఓదారుస్తున్న వీడియోలను పలు వార్తా సంస్థలు కూడా 2022లో పబ్లిష్ చేశాయి. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తీసినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కేటీఆర్ భార్య శైలిమ కేసీఆర్‌ను పట్టుకొని ఏడ్చిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll