Fake News, Telugu
 

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే పథకానికి సంబంధించి ఇంకా గైడ్లైన్స్ విడుదల చేయలేదు

0

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి గెలిచిన తరవాత ఈ పథకానికి అనేక నిబంధనలు విధించారని ఆరోపిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు వర్తించదు అంటూ ఒక పది నిబంధనల గురించి ఈ పోస్టులో ప్రస్తావించారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి గెలిచిన తరవాత ఈ పథకానికి అనేక నిబంధనలు విధించింది.

ఫాక్ట్(నిజం):  కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో శక్తి పేరుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా, గెలిచిన అనంతరం జరిగిన మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి పథకాల అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కాకపోతే ఈ పథకాలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక/నిబంధనలు ఇంకా రూపొందించలేదు. వైరల్ పోస్టులో ప్రస్తావించిన నిబంధనలు కల్పితమైనవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వివిధ రంగాలలో తాము చేయబోయే పనులకు సంబంధించి ఒక సంక్లిప్తమైన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రతీ కుటుంబంలోని మహిళా పెద్దలకు గృహలక్ష్మి స్కీం కింద రూ. 2,000 నెలవారీ అందించడం, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువనిధి పథకం కింద గ్రాడ్యుయేషన్ చేసిన యువతకు ప్రతి నెల రూ. 3,000 మరియు డిప్లొమా హోల్డర్లు రూ.1,500 అందించడం, మొదలైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

వీటితోపాటే ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేలా శక్తి అనే పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి పథకాల అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కర్ణాటకకు చెందిన మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా బీఎంటీసీకి చెందిన నాన్-ఏసీ బస్సులు, రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు.

ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కాబినెట్ ఒక సూత్రప్రాయ ఆమోదం తెలిపిందే తప్ప, ఈ పథకాలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక/నిబంధనలు ఇంకా రూపొందించలేదు. ఇప్పటికి వరకు కర్ణాటక ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి ఒక ప్రణాళికను విడుదల చేయలేదు. కాబట్టి పోస్టులో శక్తి (మహిళలకు ఉచిత ప్రయాణం) పథకానికి సంబంధించిన నిబంధనలు అంటూ షేర్ చేస్తున్నది కల్పిత సమాచారమే అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే పథకానికి అనేక నిబంధనలు విధించిందంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం కల్పితమైనది.

Share.

About Author

Comments are closed.

scroll