Fake News, Telugu
 

2021 వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సిద్దరామయ్య, డి.కే.శివకుమార్‌తో కలిసి దర్గాలో ప్రార్ధనలు చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి.కే.శివకుమార్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు దర్గాలో నమాజ్ ప్రార్థన చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి  డి.కే.శివకుమార్ దర్గాలో ప్రార్థన చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2021లో సిద్దరామయ్య, డి.కే.శివకుమార్ మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి హనగల్‌లోని అల్-హజరత్ దర్గాను దర్శించుకున్నప్పుడు తీసిన దృశ్యాలను చూపిస్తుంది. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి దృశ్యాలను ఈ వీడియో చూపించడం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు సోషల్ మీడియా యూసర్లు 2021 అక్టోబర్ నెలలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు RSSకు పోటీగా ముస్లిం ఓట్లను టార్గెట్ చేస్తూ దర్గాలను సందర్శిస్తున్నారని ఈ వీడియోని షేర్ చేస్తూ తెలుపుతున్నారు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, సిద్దరామయ్య, డి.కే. శివకుమార్ దర్గాలో ప్రార్థన చేస్తున్న ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఫోటోలని, ‘ప్రజావాణి’ అనే వార్తా సంస్థ 07 అక్టోబర్ 2021 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నాయకులు సిద్దరామయ్య, డి.కే.శివకుమార్ హనగల్‌లోని అల్-హజరత్ దర్గాను దర్శించుకున్న దృశ్యాలంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తూ తెలిపారు.

హనగల్‌ ఉపఎన్నికలకు నామినేషన్ వేసే ముందు హనగల్‌లోని మహాకాలమ్మ మందిరాన్ని అలాగే, అల్-హజరత్ దర్గాను దర్శించుకున్నామని ఇదే ఫోటోను షేర్ చేస్తూ డి. కే. శివకుమార్ 07 అక్టోబర్ 2021 నాడు ట్వీట్ పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సిద్దరామయ్య, డి.కే.శివకుమార్ ఇద్దరు దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2021 వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సిద్దరామయ్య, డి.కే.శివకుమార్‌తో కలిసి దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll