సింహాచలం దేవస్థానం కొండ పై వరద ఉధృతి దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ‘గులాబ్’ తుఫాను ప్రభావంతో ఇటీవల ఉత్తర ఆంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సింహాచలం దేవస్థానం కొండ పై వరద ఉధృతి దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో వరద నీటిలో మునిగిపోయి ఉన్నది మెదక్ జిల్లా ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయం, సింహాచలం దేవస్థానం కాదు. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకి విదుదల చేయడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయాన్ని ఇలా వరద నీటితో ముంచెత్తింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ETV Telangana’ న్యూస్ ఛానల్ 26 సెప్టెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మెదక్ జిల్లా ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయం వరద నీటితో మునిగిపోయిన దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకి విదుదలచేయడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయాన్ని ముంచెత్తినట్టు ఈ వీడియోలో తెలిపారు.
ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయం వరద నీటిలో మునిగిపోయిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో, ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయానికి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
‘గులాబ్’ తుఫాను ప్రభావంతో ఇటీవల విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో, సింహాచలం దేవాలయం మెట్ల మార్గంలో వరద ఉధృతి నెలకొన్నట్టు పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. సింహాచలం దేవాలయం మెట్ల మార్గంలో వరద ఉధృతి దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియోని సింహాచలం వరహ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో తీయలేదు.
చివరగా, ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం వరద భీభత్సం దృశ్యాలని సింహాచలం దేవస్థానం కొండ పై వరద ఉధృతి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.