Fake News, Telugu
 

లిప్ట్‌లో బ్యాటరీ పేలిన ఈ ఘటనకు కారణం బ్యాటరీ విడుదల చేసిన మాగ్నెటిక్ ఫీల్డ్ కాదు

0

లిఫ్టులో ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని తీసుకెళ్తుండగా ఆ బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి లిఫ్ట్ మొత్తం అలుముకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. బ్యాటరీ ఆ లిఫ్ట్ మొత్తాన్ని అయస్కాంత క్షేత్రంగా (మాగ్నెటిక్ ఫీల్డ్) మార్చడంతో ఇలా జరిగింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటన సింగపూర్‌లో జరిగింది, బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడం మరియు బ్యాటరీకి మోడిఫికేషన్స్ చేయడం వల్ల ఇలా జరిగింది అంటూ కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ లిఫ్టులో తీసుకెళ్తుండగా ఆ బ్యాటరీ లిఫ్ట్ మొత్తని అయస్కాంత క్షేత్రంగా (మాగ్నెటిక్ ఫీల్డ్) మార్చడంతో బ్యాటరీ నుండి మంటలు వచ్చిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2021లో చైనాలో జరిగింది. బ్యాటరీ నుండి మంటలు రావడానికి దాని నుండి వచ్చిన అయస్కాంత క్షేత్రాలు కారణం కాదు. బ్యాటరీ నుండి వచ్చే అయస్కాంత క్షేత్రాలు చాలా బలహీనంగా ఉంటాయి, వీటి ద్వారా పేలుడు సంభవించే అంత బలంగా ఇవి ఉండవు. బ్యాటరీ నుండి మంటలు రావడానికి ఓవర్ హీటింగ్/బ్యాటరీలో చేసే మార్పులు మొదలైన కారణాలు అయ్యుండొచ్చు.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటన చైనాలో జరిగింది:

వైరల్ వీడియోలో షేర్ చేస్తున్న ఈ ఘటన 2021లో చైనాలో జరిగింది. ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం వెతకగా 2021లో ఇదే ఘటనను రిపోర్ట్ చేసిన పలు చైనీస్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఐతే ఈ కథనాలు ఈ ఘటన ఎక్కడ జరిగిందని గానీ, ఘటనకు గల కారణాలేవి చెప్పలేదు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

మరింత సమాచారం కోసం వెతకగా ఈ వీడియో ఇటీవల రిపోర్ట్ చేసిన చైనీస్ వార్తా కథనాలు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వీడియోలో ఘటన 2021లో చైనాలోని గ్వాంగ్‌జౌలోని హైజు జిల్లాలో జరిగింది. ఐతే ఈ కథనాలేవి కూడా బ్యాటరీ నుండి మంటలు రావడానికి బ్యాటరీ మాగ్నెటిక్ ఫీల్డ్ కారణమని రిపోర్ట్ చేయలేదు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

షాంఘై అధికారులు ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఇంటి లోపలికి  లేదా ఎలివేటర్లలోకి తీసుకురాకుండా నిషేధించడంతో ప్రజలకు అవగాహన కోసం పాత ఘటనకు సంబంధించిన ఈ వీడియో వార్తా సంస్థలు ఇప్పుడు షేర్ చేసాయని ఈ కథనాలు తెలిపాయి. ఓవర్ హీటింగ్/బ్యాటరీలో చేసిన మార్పుల వల్ల బ్యాటరీ పేలిపోయిన ఘటనలు ఎక్కువ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

సింగపూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది:

లిఫ్టులో ఎలక్ట్రిక్ బ్యాటరీ పేలిపోయిన ఇలాంటి ఘటనే 2021లో సింగపూర్‌లో జరిగింది. బ్యాటరీలో చేసిన మార్పుల వల్లే ఈ ఘటన జరిగిందని దర్యాప్తులో తేలిందని అధికారులు నిర్ధారించారు. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ సింగపూర్ ఘటనకు సంబంధించిందే అంటూ కూడా షేర్ అయ్యింది. కానీ ఈ వీడియోకు సింగపూర్ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. సింగపూర్ ఘటనను రిపోర్ట్ చేసిన కథనాల సాక్ష్యాధారాల బట్టి చూస్తే ఇది స్పష్టం అవుతుంది. ఉదాహరణకు సింగపూర్ ఘటనలో లిఫ్ట్ పక్కనే ఉన్న గోడ ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో లిఫ్ట్ పక్కన ఉన్న గోడ రెండు భిన్నంగా ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మంటలు చెలరేగలేదు:

సాధారణంగా ఒక కండక్టర్‌లో అణువుల కదలిక లేనప్పుడు అయస్కాంత క్షేత్రాలు విడుదల కావు. బ్యాటరీ ఛార్జింగ్ లేదా డిశ్చార్జింగ్ సమయంలో అణువులలో కదలిక జరుగుతుంది కాబట్టి అప్పుడు అయస్కాంత క్షేత్రాలు ఉత్పన్నమవుతాయి. అయితే, ఈ అయస్కాంత క్షేత్రాలు చాలా బలహీనంగా ఉంటాయి, వీటి ద్వారా పేలుడు సంభవించే అంత బలంగా ఇవి ఉండవు (ఇక్కడ).

వైరల్ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం బ్యాటరీ ఎలాంటి ఛార్జింగ్ సోర్స్ కి కనెక్ట్ చేసి లేదు. అలాగే లిఫ్ట్ మొత్తం మెటల్ తో కవర్ చేసి ఉంది. ఐతే ఈ మెటల్‌లో అణువులు కదలిక లేదు. కాబట్టి ఇది కూడా ఎలాంటి అయస్కాంత క్షేత్రాలు విడుదల చేయదు. బ్యాటరీ, లిఫ్ట్ నుండి ఎలాంటి అయస్కాంత క్షేత్రాలు విడుదల కావట్లేదు కాబట్టి బ్యాటరీ నుండి మంటలు అయస్కాంత క్షేత్రాల వల్ల వచ్చాయి అన్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

లిథియం-అయాన్ బ్యాటరీలు మంటలకు గురవుతుంటాయి:

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, ఓవర్ హీటింగ్, ఎక్స్టర్నల్ డ్యామేజ్స్ మొదలైన కారణాలతో మంటలు/పేలుళ్లకు గురయ్యే అవకాశం ఉంది. దీనిని థర్మల్ రన్వే అని అంటారు. ఇలాంటి సమయాల్లో బ్యాటరీలో అధిక వేడి జెనరేట్ అయ్యి, మొత్తం సెల్ నిర్మాణాన్నే (స్ట్రక్చర్) దెబ్బతీస్తుంది. అలా ఇది బాటరీ మొత్తానికి వ్యాపించి బ్యాటరీ నుండి మంటలు రావడం లేదా పేలిపోవడం జరుగుతుంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో ఘటన ఇలాంటి పరిస్థితుల్లోనే జరిగి ఉండే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్టు ఛార్జింగ్ పరికరాలు కరెక్ట్ లేకపోవడం వల్లనో, పవర్ అధికం అవ్వడం వల్లనో బ్యాటరీలో ఎక్కువ హీట్ జెనరేట్ అయ్యి, మంటలకు దారి తీసి ఉండొచ్చు. పైన చెప్పినట్టు చైనా ప్రభుత్వం బ్యాటరీలను ఇండోర్స్‌లోకి తీసుకరావడాన్ని బ్యాన్ చేయడం కూడా ఈ వాదనను ధృవీకరిస్తుంది.

చివరగా, ఈ వీడియోలో ఘటన గతంలో చైనాలో జరిగింది, పైగా పేలుడుకు కారణం బ్యాటరీ నుండి వచ్చిన అయస్కాంత క్షేత్రానికి కారణం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll