Fake News, Telugu
 

నెల్లూరులో జైన సంఘాలకు భయపడి ముస్లిం యువకుడితో పారిపోయిన జైన అమ్మాయిని తిరిగి అప్పగించారంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం కల్పితం

0

“ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఇటీవల ఒక హిందూ జైన బాలికను ఒక ముస్లిం బాలుడు వివాహం చేసుకొవడానికి తీసుకెళ్లాడు. జైన సంఘ సభ్యులందరూ జిల్లాలో ఒక సమావేశం నిర్వహించుకొని, ముస్లిం ఉద్యోగులందరినీ తమ వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థల నుండి తక్షణమే రద్దు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం వలన పది వేల మందికి పైగా ముస్లింలు ఉపాధిని కోల్పోవడంతో, ముస్లిం మత సంఘ పెద్దలు అత్యవసర సమావేశాన్ని జరిపి పారిపోయిన జైన అమ్మాయిని తొమ్మిది గంటల లోపు ఆమె కుటుంబానికి అప్పగించారు. ఒక ఐక్య సమాజం తీసుకున్న కఠినమైన నిర్ణయం యొక్క ఫలితం ఇది”, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వైరస్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నెల్లూరు జిల్లాలో జైన సంఘాలకు భయపడి ముస్లిం యువకుడితో పారిపోయిన జైన అమ్మాయిని ముస్లిం మత పెద్దలు ఆమె కుటుంబానికి అప్పగించారు.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం కల్పితమని నెల్లూరు పోలీసులు 28 డిసెంబర్ 2019 నాడు పత్రికా ప్రకటన జారీ చేసారు. పోస్టులో తెలుపుతున్న ఘటన నెల్లూరు నగరంలోనే కాదు, జిల్లాలోని మరే ఒక ప్రదేశంలో చోటుచేసుకోలేదని నెల్లూరు పోలీసులు ఈ ప్రెస్ రిలీజ్‌లో స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం నెల్లూరు పోలీసుల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో వెతికితే, ఈ వార్తకు సంబంధించి నెల్లూరు పోలీసులు 28 డిసెంబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజిలో పత్రికా ప్రకటన జారి చేసినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న ఈ సమాచారం కల్పితమని నెల్లూరు పోలీసులు తమ ప్రెస్ రిలీజ్‌లో స్పష్టం చేసారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోనే కాదు, జిల్లాలోని మరే ప్రదేశంలో చోటుచేసుకోలేదని నెల్లూరు పోలీసులు స్పష్టం చేసారు.

ప్రజల మద్య జాతి, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి కల్పిత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP శ్రీ బాస్కర్ భూషణ్ ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. నెల్లూరు పోలీసులు షేర్ చేసిన చేసిన ఇంగ్లీష్ ప్రెస్ రిలీజ్‌ని రిపోర్ట్ చేస్తూ ‘Hindustan Times’ 04 జనవరి 2020 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అంతేకాదు, పోస్టులో ముస్లిం యువకుడితో పారిపోయిన అమ్మాయిని హిందూ జైన బాలిక అని పేర్కొన్నారు. కాని, హిందూ, జైన మతాలు రెండు విభిన్న మతాలు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన సమాచారం కల్పితమని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, జైన సంఘాలకు భయపడి ముస్లిం యువకుడితో పారిపోయిన అమ్మాయిని తిరిగి అప్పగించినట్టుగా షేర్ చేస్తున్న ఈ సమాచారం కల్పితం.

Share.

About Author

Comments are closed.

scroll