ప్రధానమంత్రి మోదీ గిటార్ వాయిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మణిపూర్ రాష్ట్రం అల్లర్లతో తగలబడిపోతుంటే మోదీ అవి పట్టించుకోకుండా గిటార్ వాయిస్తున్నాడని అంటూ ఈ ఫోటో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: మోదీ గిటార్ వాయిస్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఇది నిజమైన ఫోటో కాదు. ఒక డిజిటల్ క్రియేటర్ దీనిని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించాడు. ఫోటో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఈ క్రియేటర్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటో ఒకటి గతంలో కూడా వైరల్ అయ్యింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో మెయిటీ మరియు కుకీ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ హింసలో హింస ఇప్పటివరకు 52 మంది చనిపోయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే మోదీ గిటార్ వాయిస్తున్న ఈ ఫోటోకు, మణిపూర్ అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ ఫోటో నిజమైంది కాదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈ ఫోటోను తయారు చేసారు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో షహీద్ అనే ఒక డిజిటల్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీలో మాకు కనిపించింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తాను ఈ ఫోటోను తయారు చేసినట్టు ఫోటోను షేర్ చేసిన పోస్టులో స్పష్టంగా పేర్కొన్నాడు. తన ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ‘AI Enthusiast’ అని స్పష్టంగా పేర్కొన్నాడు.
ఈ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇలాంటివే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన పలువురు ప్రముఖల ఫోటోలు కూడా ఉన్నాయి. గతంలో ఈ అకౌంట్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన మోదీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు మేము వివరణ కోసం అతనిని సంప్రదించినప్పుడు తాను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించినట్టు స్పష్టం చేసాడు.
ఈ మధ్య కాలంలో ఇలా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటోలు నిజమైన ఫోటోల లాగా సోషల్ మీడియా షేర్ అవుతున్నాయి. FACTLY ఇలాంటి ఫోటోల గురుంచి రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, మోదీ గిటార్ వాయిస్తున్న ఈ ఫోటో నిజమైంది కాదు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రూపొందించింది.