ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు చెప్పినట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఫాక్ట్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ప్రామాణికతపై ఢిల్లీ రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసే సమయంలో వారిపై చేసిన ఆరోపణలను ఈడీ రుజువు చేయనందున వారిపై వేసిన కేసు నిజమైనదిగా కోర్టు భావించడంలేదని పేర్కొంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
ముందుగా వైరల్ అవుతున్న పోస్టులన్నీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు 06 మే 2023న జారీ చేసిన బెయిల్ ఆర్డర్‌లోని విషయాలను ప్రస్తావిస్తున్నట్లు గుర్తించాం.
బెయిల్ ఆర్డర్‌లోని సమాచారం ప్రకారం, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలతో ఫిబ్రవరి 2023లో రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా అనే ఇద్దరు వ్యాపారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన డబ్బుని వారిద్దరూ తమ వ్యాపారాల ద్వారా మళ్లించి గోవా ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడినట్లు ఈడీ పేర్కొంది.
ఇక మార్చి 2023లో వారిద్దరూ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాజేష్ జోషి, గౌతం మల్హోత్రా పేర్లు సిబిఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో లేవని, పైగా వారు సౌత్ గ్రూప్‌లో సభ్యులు కారని, కానీ వారిని అన్యాయంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ వారి తరపు న్యాయవాదులు వాదించారు. అయితే వారిద్దరూ హవాలా, నకిలీ ఇన్వాయిస్ వంటి మార్గాలలో డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికలలో వినియోగించారని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు ఈడీ ఎటువంటి కచ్చితమైన ఆధారాలను ప్రవేశపెట్టలేదని, కేవలం సాక్షులు, అప్రూవర్లు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోలేమని 06 మే 2023న ఇద్దరికీ రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈడీ సమర్పించిన ఈ ఆధారాలు వీరిరువురిపై మోపబడిన కేసు నిజమైనదిగా కోర్టు భావించడానికి సరిపోవని బెయిల్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
అయితే ఇక్కడ ‘కేసు’ అనగా, రాజేష్ జోషి మరియు గౌతం మల్హోత్రాలపై దాఖలు అయిన కేసు గురించి కోర్టు ప్రస్తావించింది కానీ, మొత్తంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ప్రామాణ్యత గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ముందస్తు బెయిల్ దరఖాస్తు సమయాల్లో కేసు యొక్క ఆధారాలను/సాక్ష్యాలను విస్తృతంగా వివరించడం చేయవద్దని మరొక కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. అందువలన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఇంకా దర్యాప్తులో ఉన్న కారణంగా, బెయిల్ ఆర్డర్‌లో ఆ కేసు పూర్తి వివరాలను వెల్లడించలేదు.
చివరిగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆధారాలు లేవని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు ఎక్కడా ఇంకా ప్రస్తావించలేదు.