ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్టు ఉన్న ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించి నిజమేంటో తెలుసుకుందాం.
క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతి పంప్ నుండి నీళ్ళు తాగుతున్న ఫోటోని డిజిటల్ గా మార్ఫ్ చేసి యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్టు తయారు చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
2017లో ఇదే ఫోటో వైరల్ అయినప్పుడు ఒక జర్నలిస్ట్ ఈ ఫోటో నిజం కాదంటూ, అసలైన ఫోటోని తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసాడు. అసలైన ఫోటోలో యోగి ఆదిత్యనాథ్ ఒక చేతి పంపు నుండి నీళ్ళు తాగుతూ కనిపిస్తాడు. ఈ ఫోటోని పోస్టులోని ఫోటోతో పోల్చినప్పుడు ఒక ఆవు తప్ప రెండు ఫోటోలలో మనుషులు, చుట్టు పక్క ఉన్న పరిసరాలు అన్నీ ఒకేలా ఉండడం చూడొచ్చు.
పోస్టులోని ఫోటోలో ఉన్న ఆవు ఫోటోని మాత్రమే క్రాప్ చేసి సెర్చ్ చేయగా, ఈ అవు యొక్క పూర్తి ఫోటో మాకు ఒక వెబ్సైటులో కనిపించింది. ఐతే ఈ ఫోటోలో ఆవు యొక్క వెనకలి భాగాన్ని, యోగి నీళ్ళు తాగుతున్న అసలైన ఫోటోలో చేతిపంపు స్థానంలో డిజిటల్ గా అతికించినట్టు అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్టు ఉన్న ఈ ఫోటో డిజిటల్ గా మార్ఫ్ చేయబడింది.