Fake News, Telugu
 

మండుతున్న నూనె/పెట్రోల్‌లో నీరు పోసినప్పుడు కూడా ఇటువంటి విస్పోటనం జరుగుతుంది

0

‘ఈ హోమాన్ని ప్రవర్గ్య హోమం అంటారు. దీనిని అనుభవంతులైన వేద పండితులు మాత్రమే నిర్వహించగలరు. పేలుడు మరియు అణుబాంబు ఆకారం కేవలం 50 ML స్వచ్ఛమైన నెయ్యి ఫలితంగా వచ్చింది. మన వేదాలలో ఇలాంటి నమ్మశక్యం కాని విషయాలు చాలా ఉన్నాయి’, అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో అవుతుంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: నమ్మశక్యం కానీ రీతిలో ప్రవర్గ్య హోమం అనే యాగంలో కేవలం 50 ML నెయ్యి ఫలితంగా పెద్ద పేలుడుతో పాటు అణుబాంబు ఆకారంలో మంటలు వ్యాపిస్తాయి.

ఫాక్ట్: మామూలుగా జరిగే యాగాలలాగా కాకుండా, ఈ రకమైన యాగాలలో, బాగా మరుగుతున్న నెయ్యి పాత్రలో పాలని పోస్తారు. పాలు పాత్ర కింది బాగానికి చేరుకుంటాయి. పాత్ర వేడి వలన పాలలో ఉండే నీరు తక్షణమే ఆవిరి అవుతాయి. ఇది మరుగుతున్న నెయ్యిని మంటలతో అంటుకునేలా చేసి పెద్ద విస్పోటనం అయ్యేలా చేస్తుంది. అయితే, ఇది కేవలం నెయ్యితోనే కాదు, మండుతున్న నూనె/ పెట్రోలియం ఉత్పత్తులలో కూడా నీరు పోసినప్పుడు ఇటువంటి ఫలితాలే వస్తాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ అవుతున్న వీడియోని పరిశీలించగా ఇది సాధారణ యాగానికి భిన్నంగా ఉండటం చూడవచ్చు. సాధారణ యాగలలో నెయ్యి మరియు ఇతర పదార్ధాలను ఉపయోగిస్తారు. అయితే వైరల్ వీడియోలోని వ్యక్తి మంటల మధ్యలో ఉన్న పాత్రలో ఒక ద్రవం వేయడం వలన మంట చెలరేగడం చూడవచ్చు.

వివిధ వార్తా కథనాలు, డాక్యుమెంటరీలు మరియు రిసెర్చ్ పేపర్ల ప్రకారం, అతిరాత్ర యాగం (ఒక రకమైన సోమ యాగం)లో భాగంగా ఈ ప్రవర్గ్యను నిర్వహిస్తారు. ఆవు నెయ్యిని ముందుగా ఒక కుండ లేదా పాత్రలో బాగా వేడి చేస్తారు. తరువాత ఆవు పాలు ఈ మరుగుతున్న నేతిలో వేస్తారు. అప్పుడు ఒక పెద్ద విస్పోటనం లాగా మంట వ్యాపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక ఇలాంటి విస్పోటనం కేవలం ఈ యాగంలో ఉపయోగించే పదార్ధాలు లేదా ప్రక్రియ వలనే మాత్రమే కాకుండా మరుగుతున్న నూనె, పెట్రోల్ వంటి పదార్ధాలలో కూడా నీరు పోసినప్పుడు కూడా ఇటువంటి విస్పోటనమే జరుగుతుంది. ఈ పదార్ధాలు నీటితో కలవవు కనుక, మండుతున్న నూనె/నెయ్యి/ఇతర పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న పాత్రలో, నీరు పోసినప్పుడు అది పాత్ర కిందకు చేరుకుంటుంది. తీవ్రమైన వేడి వలన అది అప్పటికప్పుడు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి అనేక 1700 రేట్లు ఎక్కువగా విస్తరిస్తుంది. అందువలన పాత్రలో  ఉన్న నూనె/ నెయ్యికి  మంట అంటుకొని పేలుడు జరుగుతుంది. సంబంధిత వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ కారణంగానే class B (నూనె, పెట్రోలియం ఉత్పత్తుల వలన వచ్చే మంటలు)  మంటలను నీటితో కాకుండా ఫైర్ ఎక్ష్టింగ్విషర్ తో ఆర్పి వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, కేవలం యాగంలోనే కాకుండా సాధారణంగా కూడా మరుగుతున్న నూనె/నెయ్యి/ పెట్రోల్ వంటి పదార్ధాలు నీరు/పాలు లాంటి పదార్థాలతో కలిపినప్పుడు పెద్ద విస్పోటనం లాగా  మంట వ్యాపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll