Fake News, Telugu
 

1986లో రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు ఒక బిచ్చగాడిని కాల్చి చంపారన్నది ఒక కల్పిత వాదన

0

ఇటీవల పంజాబ్‌లో భద్రతా కారణాల వల్ల ప్రధానమంత్రి మోదీ పర్యటన అర్ధాంతరంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 1986 గాంధీ జయంతి నాడు రాజఘాట్ వద్ద అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్నాన్ని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది ఒక మతి స్థిమితంలేని ఒక బిచ్చగాన్ని కాల్చి చంపేసాయంటూ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్ననాన్ని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది ఒక మతి స్థిమితంలేని ఒక బిచ్చగాన్ని కాల్చి చంపేసారు.

ఫాక్ట్ (నిజం): 1986లో రాజఘాట్ వద్ద రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్నంలో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి, ఎవరూ చనిపోలేదు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఈ దాడికి సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కూడా దాడిలో కేవలం ఆరుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారని మాత్రమే రిపోర్ట్‌లో పేర్కొంది. వార్తా కథనాలు కూడా ఇలానే రిపోర్ట్ చేసాయి. ఈ దాడిలో పోలీసులు ఒక బిచ్చగాడిని కాల్చి చంపారన్నది పూర్తిగా కల్పితం. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో ‘AP’ అని అసోసియేటెడ్ ప్రెస్ యొక్క లోగో స్పష్టంగా చూడొచ్చు. దీని ఆధారంగా యూట్యూబ్‌లో వెతకగా అసోసియేటెడ్ ప్రెస్ తమ యూట్యూబ్‌ అప్లోడ్ చేసిన వీడియో రిపోర్ట్ కనిపించింది. ఈ వీడియో రిపోర్ట్ వివరణ ప్రకారం, అక్టోబర్ 1986లో, మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు హాజరైన అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై పక్కనే దాక్కున్న ఒక సిక్కు వ్యక్తి (కరంజిత్ సింగ్) కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రాజీవ్ గాంధీ క్షేమంగా భయటపడగా, పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం కాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ జరిపి ఒక రిపోర్ట్ సమర్పించింది. దుండగుడు దాడికి ఒక నాటు తుపాకిని ఉపయోగించాడు, తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. పోలీసు విచారణలో అతను మొదట తన పేరు మన్మోహన్ దేశాయ్ అని చెప్పి, తర్వాత పలు సందర్భాల్లో వేరే పేరు చెప్పినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

ఈ దాడిలో కేవలం ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయని అధికారిక రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరైనా చనిపోయి ఉంటే, ఈ రిపోర్ట్‌లో ఆ విషయం ప్రస్తావించే వారు, కాని అలాంటి ప్రస్తావనేది కూడా ఈ రిపోర్ట్‌లో లేదు.

1986లో ఈ ఘటనని రిపోర్ట్ చేసిన వార్తా కథనాల ప్రకారం కూడా ఈ దాడిలో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయే తప్ప ఎవరూ చనిపోలేదు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేసారు.

ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ కథనాలలేవి కూడా పోలిసుల కాల్పుల్లో ఒక మతిస్థిమితంలేని ఒక బిచ్చగాడు చనిపోయినట్టు రిపోర్ట్ చేయలేదు. దీన్ని బట్టి ఈ వాదన పూర్తిగా కల్పితమని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, 1986లో రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు ఒక బిచ్చగాడిని కాల్చి చంపారన్నది ఒక కల్పిత వాదన.

Share.

About Author

Comments are closed.

scroll