Fake News, Telugu
 

రిజర్వేషన్ వ్యవస్థకు తాను వ్యతిరేకమని ప్రధాని మోదీ అనలేదు; 1961లో నెహ్రూ రాసిన లేఖను ఆయన చదివారు

0

పార్లమెంట్‌లో రిజర్వేషన్ల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,  ఇది పనిలో సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి రిజర్వేషన్‌లకు మోదీ వ్యతిరేకం అని పోస్టు చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇదే పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధాని మోదీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లభిస్తే ప్రభుత్వ పనిలో సామర్థ్యం కనపడదు అని పార్లమెంటులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు.

ఫాక్ట్(నిజం):  ఈ వీడియో 7 ఫిబ్రవరి 2024న, రాజ్యసభలో ప్రధాని మోదీ యొక్క ‘మోషన్ ఆఫ్ థాంక్స్’ పూర్తి ప్రసంగాన్ని ఎడిట్ చేసిన వీడియో క్లిప్. ఈ నేపద్యంలో మోదీ , నెహ్రూ ఒకసారి ముఖ్యమంత్రులకు రిజర్వేషన్లపై తన అయిష్టతను వ్యక్తం చేస్తూ “నేను ఎలాంటి రిజర్వేషన్‌లను ఇష్టపడను, ముఖ్యంగా ప్రభుత్వ సేవలలో అసమర్థత మరియు తక్కువ స్థాయి ప్రమాణాలకు దారితీసే దేనికైనా నేను తీవ్రంగా వ్యతిరేకం” అని రాసిన లేఖను చదివిన సందర్భంలోది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, 07 ఫిబ్రవరి 2024న హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పందిస్తూ, ప్రధాని మోదీ జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖన చదివారు.  రిజర్వేషన్లు ప్రభుత్వ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని ఉద్యోగాలలో రిజర్వేషన్లకు మొదటి ప్రధాని వ్యతిరేకమని లేఖ స్పష్టంగా పేర్కొంది అని ప్రధాని మోదీ తెలిపారు.

తరువాత, సంసద్ TVలో రాజ్యసభలో భారత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే పూర్తి వీడియోను పరిశీలించాం. ప్రధాని మోదీ తన ప్రసంగంలో, తమ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదం, నక్సలైట్ల సమస్య, అంతర్గత మరియు భద్రత మొదలైన వివిధ అంశాలపై తమ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అని, ఎస్సీ/ఎస్టీలకు, రిజర్వేషన్ వ్యవస్థకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రసంగం కొనసాగిస్తూ, జవహర్‌లాల్ నెహ్రూ ఒకసారి ముఖ్యమంత్రులకు రిజర్వేషన్లపై తన అయిష్టతను వ్యక్తం చేస్తూ లేఖ రాశారని ఆ లేఖను చదువుతూ, “నేను ఎలాంటి రిజర్వేషన్‌లను ఇష్టపడను, ముఖ్యంగా ప్రభుత్వ సేవలలో. దేశంలో అసమర్థత మరియు తక్కువ స్థాయి ప్రమాణాలకు దారితీసే దేనికైనా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను” అని రాశారని పేర్కొన్నారు. రాజ్యసభలో మోదీ చేసిన పూర్తి ప్రసంగాన్ని ఎడిట్ చేసి షేర్ చేసినట్టు మరియు రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఈ సమాచారం నుండి స్పష్టమైంది.

చివరిగా, రిజర్వేషన్ వ్యవస్థకు తాను వ్యతిరేకమని ప్రధాని మోదీ చెప్పలేదు; 1961లో నెహ్రూ రాసిన లేఖను ఆయన రాజ్యసభలో చదివారు.

Share.

About Author

Comments are closed.

scroll