Fake News, Telugu
 

ఒడిశాకి సంబంధించిన వీడియోని అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ జాతీయ పతాకాన్ని అవమానించాడంటూ ఒక వ్యక్తి  జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ప్రభుత్వ అధికారి జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగింది. పూరీలోని సిమిలి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి ప్రశాంత్ కుమార్ స్వైన్ జాతీయ పతాకంతో ఆఫీస్‌లోని టేబుల్ తుడవడంతో, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను ఉల్లంఘించినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ కూడా చేసారు. ఈ ఘటనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫాక్ట్-చెకింగ్ విభాగం కూడా ఈ విషయాన్ని ద్రువీకరించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగే, కానీ ఈ ఘటనకి ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగింది. వైరల్ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించి పలు వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ కథనాల ప్రకారం వీడియోలో కనిపిస్తున్నది పూరీలోని సిమిలి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి ప్రశాంత్ కుమార్ స్వైన్. ఈయన జాతీయ పతాకంతో ఆఫీస్‌లోని టేబుల్ తూడ్చాడు. ఐతే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను ఉల్లంఘించినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. ఐతే అంతకుముందే ప్రశాంత్ కుమార్ స్వైన్ తాను చేసిన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ కూడా చెప్పాడు.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫాక్ట్-చెకింగ్ విభాగం ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధంలేదని స్పష్టంచేసింది.

చివరగా, ఒడిశాలో పంచాయతీ అధికారి జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న దృశ్యాలను ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll