Fake News, Telugu
 

భారత్‌ను విమర్శించినందుకు భారత ప్రభుత్వం OIC సభ్యదేశాలపై పరువునష్టం దావా వేసిందన్నది నిజం కాదు.

0

బీజేపీ అధికార ప్రతినిధి ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ దేశాల సమాఖ్య అయిన ‘ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)’ భారత్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా OIC వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పలు చర్యలు తీసుకున్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత్‌పై విమర్శలకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం OIC సభ్యదేశాలపై తీసుకున్న చర్యలు.

ఫాక్ట్(నిజం): ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై భారత్‌ను విమర్శిస్తూ OIC చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించినప్పటికీ, OICపై పరువునష్టం దావా వేయటం, OIC సభ్య దేశాల నుండి దిగుమతి చేసుకునే చమురులో కోతలు విధించడం, OIC దేశాలకు ఎగుమతి చేసే గోదుమలు మరియు ఇతర ఆహార ధాన్యాలలో కోత విధించడం వంటి చర్యలేవి తీసుకోలేదు. భారత ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతులు పెరిగినప్పటికీ, ఈ నిర్ణయానికి ముహమ్మద్ ప్రవక్త వివాదానికి ఎటువంటి సంబంధంలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇస్లామిక్ దేశాల సమాక్య అయిన ‘ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్’ యొక్క జనరల్ సెక్రెటేరియట్ స్పందిస్తూ భారత్‌పై తీవ్ర విమర్శలు చేసింది. భారత్‌లో మైనారిటీల పట్ల అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు చేసింది.

ఐతే OIC వ్యాఖ్యలను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి OIC వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక అధికారిక ప్రకటన జారీ చేసారు. భారత్‌లో అన్ని మతాలు సమానమేనని ఈ ప్రకటనలో తెలిపారు.

ఐతే, పోస్టులో చెప్తున్నట్టు భారత ప్రభుత్వం OICపై పరువునష్టం దావా వేయటం, OIC సభ్య దేశాల నుండి దిగుమతి చేసుకునే చమురులో కోతలు విధించడం, OIC దేశాలకు ఎగుమతి చేసే గోదుమలు మరియు ఇతర ఆహార ధాన్యాలలో కోత విధించడం వంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి చర్యలు భారత ప్రభుత్వం నిజంగానే తీసుకొని ఉంటే మీడియా ఈ అంశాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి కథనాలేవి మాకు లభించలేదు.

భారత ప్రభుత్వం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గత నెలలోనే విదేశాలకు ఎగుమతి చేసే గోధుమలపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం ముహమ్మద్ ప్రవక్త వివాదం మొదలుకాక ముందే తీసుకుంది.

అలాగే భారత్ నుండి ఐరోపా దేశాలకు శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతి ఇటీవల కాలంలో పెరిగినప్పటికీ, దీనికి ముహమ్మద్ ప్రవక్త వివాదానికి ఎటువంటి సంబంధంలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కు చెందిన ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు రష్యా నుండి తక్కువ ధరలకు చమురు కొని, దానిని శుద్ధి చేసి ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎగుమతులు పెంచాలనుకుంటున్నట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఈ నిర్ణయానికి ముహమ్మద్ ప్రవక్త వివాదానికి ఎటువంటి సంబంధంలేదు.

చివరగా, భారత్‌ను విమర్శించినందుకు భారత ప్రభుత్వం OIC సభ్యదేశాలపై పరువునష్టం దావా వేసిందన్నది నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll