Fake News, Telugu
 

హిందూ పిల్లలు అరటి ఆకులలో భోజనం చేస్తున్న ఈ ఫోటో జర్మనీ లో తీసింది కాదు

0

జర్మనీలో హిందూ సంస్కృతికి పెద్దపీట వేస్తున్నారని చెప్తూ, హిందూ వేషధారణలో ఉన్న కొందరు పిల్లలు అరటి ఆకులలో భోజనం చేస్తున్న ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జర్మనీలో హిందూ వేషధారణలో ఉన్న కొందరు పిల్లలు అరటి ఆకులలో భోజనం చేస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో హిందూ వేషధారణలో ఉన్న కొందరు పిల్లలు అరటి ఆకులలో భోజనం చేస్తున్నది పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లోని భక్తివేదాంత గురుకులానికి చెందిన విద్యార్థులు. ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని అక్టోబర్ 2020లో షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టు మాకు కనిపించింది. ఈ పోస్టులో ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఫోటో పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో ఉన్న భక్తివేదాంత గురుకుల్ కి సంబందించింది. 

ఫేస్‌బుక్ పోస్టు ఆధారంగా గూగుల్ లో వేతకగా ఈ గురుకుల్ కి సంబంధించిన వెబ్సైటు మరియు ఫేస్‌బుక్ పేజి కనిపించాయి. ఈ ఫేస్‌బుక్ గురుకులానికి సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోస్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే భక్తివేదాంత గురుకులంలోని పిల్లలు పోస్టులో పిల్లలు ధరించిన లాంటివే వస్త్రాలు ధరించడం గమనించొచ్చు.

ఇంకా యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా భక్తివేదాంత అకాడమీ యొక్క టూర్ వీడియో కనిపించింది. ఈ వీడియోలో వంటగదిలోని గోడలు పోస్టులోని ఫోటోలో ఉన్న గోడలు అచ్చం ఒకేలా ఉండడం గమనించొచ్చు.  

ఈ ఫోటోకి సంబంధించి స్పష్టత కోసం బూమ్ ఫాక్ట్-చెకింగ్ ఏజెన్సీ వారు ఇస్కాన్ మాయాపూర్ మీడియా కమ్యూనికేషన్స్ హెడ్ అయిన సుబ్రోతో దాస్ ని సంప్రదించగా అతను ఈ ఫోటోలు భక్తివేదాంత గురుకుల్ కి సంబంధించినవే అని, ఫోటోలో ఉన్నది గురుకుల్ కి చెందిన విద్యార్థులేనని నిర్ధారించారు. కాకపోతే అవి ఎప్పుడు తీసారో మాత్రం చెప్పలేదు.

చివరగా, హిందూ వేషధారణలో ఉన్న కొందరు పిల్లలు అరటి ఆకులలో భోజనం చేస్తున్న ఈ ఫోటో జర్మనీ లో తీసింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll