Fake News, Telugu
 

2021లో జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్ధులు అన్నీ చోట్ల ఓడిపోలేదు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ 3050 సీట్లకు 3050 సీట్లు ఓడిపోయింది, అని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ 3050 సీట్లకు 3050 సీట్లు ఓడిపోయింది.

ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికలు, గ్రామ పంచాయితీ, గ్రామ ప్రధాన్ మరియు బ్లాక్ పంచాయితీ ఎన్నికలలతో పాటు 2021 ఏప్రిల్ నెలలో నిర్వహించారు. ఇవి ఈ మధ్య జరిగిన ఎన్నికలు కాదు. ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా నిర్వహించబడవు. 2021 మే నెలలో విడుదల చేసిన ఫలితాలలో స్వతంత్ర అభ్యర్ధులే అధిక జిల్లా పరిషత్ వార్డు స్థానాలు గెలుచుకున్నారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్ధులు 3050 జిల్లా పరిషత్ సీట్లలో 918 గెలిచారని ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులు అప్పుడు ప్రకటించుకున్నారు. అధికారికంగా పార్టీల గుర్తుల ఆధారంగా ఈ ఎన్నికలు జరుగనందున, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ, బీజేపీ మద్దతు పలికిన అభ్యర్ధులు 3050 జిల్లా పరిషత్ స్థానాలకి 3050 ఒడిపోయినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలు, గ్రామ పంచాయితీ, గ్రామ ప్రధాన్ మరియు బ్లాక్ పంచాయితీ ఎన్నికలలతో పాటు 2021 ఏప్రిల్ నెలలో నిర్వహించినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ స్థానిక ఎన్నికల సర్కులర్‌ను 26 మార్చి 2021 నాడు విడుదల చేసింది. 2021 మే నెలలో ఈ స్థానిక పంచాయితీ ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు.

అయితే, ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా నిర్వహించబడవు. ఎన్నికైన జిల్లా పరిషత్ వార్డు సభ్యుల జాబితాలో వారు ఏ రాజకీయ పార్టీ చెందినవారన్నది ఎక్కడా పేర్కొనలేదు. 

2021 మే నెలలో జరిగిన కౌంటింగ్ పూర్తయిన తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులే అధిక స్థానాలు గెలుచుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ‘దైనిక్ భాస్కర్’ మరియు ‘పత్రిక’ వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ప్రకారం, జిల్లా పరిషత్ ఎన్నికల అంతిమ ఫలితాలలో 3050 సీట్లకు గాను బీజేపీ మద్దతు పలికిన అభ్యర్ధులు 768 సీట్లు, సమాజ్‌వాది పార్టీ మద్దతు పలికిన అభ్యర్ధులు 759 సీట్లు, స్వాతంత్ర్య అభ్యర్ధులు 944 సీట్లు గెలిచినట్లు తెలిసింది.     

అయితే, బీజేపీ మద్దతు పలికిన అభ్యర్ధులు 918 జిల్లా పరిషత్ స్థానాలు గెలిచారని అప్పటి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర సింగ్ అప్పుడు మీడియాకు ప్రకటించారు. అలాగే, సమాజ్‌వాది పార్టీ కూడా తాము మద్దతు పలికిన అభ్యర్ధులు జిల్లా పరిషత్ ఎన్నికలలో సగం కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారని ప్రకటించుకుంది. అధికారికంగా పార్టీల గుర్తుల ఆధారంగా ఈ ఎన్నికలు జరుగనందున, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది నిర్ణయించడం సాధ్యం కాదు. కానీ, బీజేపీ మద్దతు పలికిన అభ్యర్ధులు 3050 జిల్లా పరిషత్ స్థానాలకు 3050 ఒడిపోయినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు.

చివరగా, ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా నిర్వహించబడవు; 2021లో జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎనికలలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్ధులు అన్నీ చోట్ల ఓడిపోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll