Fake News, Telugu
 

ఈ వడగండ్ల వాన వీడియో తెలంగాణకి కానీ, భారతదేశానికి కానీ సంబంధించింది కాదు

0

ఒక వర్షం వీడియోని కొందరు “హుజురాబాద్ లో వడగండ్ల వాన” అని పోస్ట్ చేస్తే, మరికొందరు అదే వీడియోని పెట్టి, “నిడమానూరు మండలంలో వడగండ్ల వాన” అని షేర్ చేస్తున్నారు. రెండు ప్రాంతాలు తెలంగాణలోనివి. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలో పడిన వడగండ్ల వాన వీడియో.

ఫాక్ట్: వీడియో అసలు భారతదేశానికి సంబంధించిందే కాదు. ఆ వీడియోని తీసింది నేపాల్ దేశంలో. అంతేకాదు, అది ఒక పాత వీడియో. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోని పలు సార్లు వివిధ ప్రదేశాలకి సంబంధించిన వీడియోగా చాలా మంది షేర్ చేసినట్టు తెలిసింది. కొందరు అది ఛత్తీస్‌గఢ్ వీడియో అని షేర్ చేస్తే, మరికొందరు అది వియత్నాం వీడియో అని షేర్ చేసారు. 19 ఏప్రిల్ 2020న ఫేస్బుక్‌లో ఒకరు పెట్టిన వీడియోపైన ‘diwakarbartaula’ అనే ఒక టిక్‌టాక్ ఐడీ కనిపిస్తుంది. ఆ ఐడీ గురించి వెతకగా, పోస్ట్‌లోని వీడియోని మొదటిగా 18 ఏప్రిల్ 2020న ‘diwakarbartaula’ అనే టిక్‌టాక్ యూసర్ పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్ట్ లో అతను ‘నేపాల్’, ‘చిత్వాన్’ అని పెట్టడం చూడవచ్చు.

ఆ టిక్‌టాక్ యూసర్‌ని 2020లో ‘Fact Crescendo’ వారు సంప్రదించిగా, అది నేపాల్ వీడియో అని చెప్పడమే కాదు, అదే ప్రదేశం నుండి మరొక వీడియో పంపించినట్టు ఇక్కడ చదవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోని వీడియో భారతదేశానికే సంబంధించింది కాదు.

ఇదే వీడియో ఇంతకముందు ‘వరంగల్’ పేరుతో కూడా 2020లో వైరల్ అయింది. అప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ అర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పోస్ట్‌లోని వడగండ్ల వాన వీడియో తెలంగాణకి లేదా భారతదేశానికి సంబంధించింది కాదు. అది నేపాల్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll