Fake News, Telugu
 

ఈ ఫోటో హర్యానాకు సంబంధించిన బాబా భలేగిరి అగ్ని తపస్య చేస్తుండగా తీసినది, హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఫోటో కాదు

0

Update (14 November 2022):
ఇదే ఫోటోను ఇప్పుడు కొందరు ‘కేదారనాథ్ మందిరం మూసేసి 2 వారాలు దాటిపోయినా కూడా -10° C చలిలో ధ్యానంలో ఉన్న ఈ యోగిపుంగవుణ్ణి….’ అంటూ షేర్ చేస్తున్నారు. కానీ, క్రింద వివరించినట్టు ఈ ఫోటో శ్రీ మహంత్ భలేగిరి జి మహారాజ్ అగ్ని తపస్య చేస్తుండగా తీసింది.

ఒక ఫోటోను చూపిస్తూ, హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవించే వ్యక్తులు ఉన్నారనడానికి ఇది సాక్ష్యం అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఫోటోలోని వ్యక్తి, ఎండ వాన చలి నుండి తట్టుకుని ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా జీవించే శక్తి రుషులు, మునుల సొంతం అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవించే వ్యక్తులు ఉన్నారనడానికి సాక్ష్యం ఈ ఫోటో.

ఫాక్ట్: ఈ ఫొటోకు హిమాలయాల్లో జీవించే రుషులు, మునులకు సంబంధంలేదు. శ్రీ మహంత్ భలేగిరి జి మహారాజ్ అగ్ని తపస్య చేస్తుండగా తీసింది ఈ ఫోటో. బాబా భలేగిరి హర్యానాలోని రింధాన గ్రామంలో శీతల మాత మందిరం సమీపంలో ఇటువంటి తపస్సు తరచూ చేస్తారు. ఇలా తపస్సు చేసే ఫోటోలు, వీడియోలు ఫేస్బుక్, యూట్యూబ్‌ అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తుంటారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అటువంటి ఇమేజ్ ఒక ఫేస్బుక్ పోస్టులో లభించింది. బాబా సారాబంగి I అనే ఫేస్బుక్ పేజీలో 18 జూన్ 2019న ఇదే ఫోటోని పోస్ట్ చేసినట్టు చూడొచ్చు. ఫోటోలో ఉన్నది బాబా భలేగిరి జి మహారాజ్ అని ఫేస్బుక్ పోస్టులో తెలిపారు. కానీ, ఫోటో మాత్రం హిమాలయాల్లో మంచుతో నిండినట్టు లేదు. ఇదే ఫోటోను మొత్తం నల్లగా (బ్లాక్ & వైట్) మార్చి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అసలు ఫొటోలో ఉన్న చెంబు, ఇతర వస్తువులు వేరే రంగులో ఉన్నట్టు చూడొచ్చు.

శ్రీ మహంత్ భలేగిరి జి మహారాజ్ అగ్ని తపస్య చేస్తుండగా తీసిన వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బాబా వంటిపై ఉన్నది కూడా మంటతో వచ్చిన బూడిద. ఇవే ఫోటోలు కాకుండా, బాబా భలేగిరి జి మహారాజ్ అగ్ని తపస్య చేస్తున్న ఫోటోలు (వేరే వైపుల నుంచి) ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బాబా భలేగిరి జి మహారాజ్ హర్యానాలోని రింధాన గ్రామంలో శీతల మాత మందిరం సమీపంలో ఇటువంటి తపస్సు తరచూ చేస్తారని ప్రసిద్ధి.

చివరగా, హర్యానాకు సంబంధించిన బాబా భలేగిరి అగ్ని తపస్య చేస్తుండగా తీసిన ఫోటోను పట్టుకొని, హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవించే రుషులు, మునులు ఉన్నారనడానికి సాక్ష్యం అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll