Fake News, Telugu
 

పైకప్పు కూలిపోయిన ఈ నమో మెడికల్ కాలేజీ దాద్రా & నగర్ హవేలీలో ఉంది, గుజరాత్‌లో కాదు

0

అవినీతితో కుప్పకూలిన నమో మెడికల్ కాలేజీ” అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. “ప్రధాని మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో రూ. 139 కోట్ల బడ్జెట్‌తో తన పేరు మీద నిర్మిస్తున్న నమో మెడికల్ కాలేజీ భవనాలు నిర్మాణ దశలోనే నేలమట్టమయ్యాయి” అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్‌లో మోదీ పేరు మీద నిర్మిస్తున్న నమో మెడికల్ కాలేజీ నిర్మాణ దశలోనే కుప్పకూలింది.

ఫాక్ట్: నమో మెడికల్ కాలేజీ సిల్వస్సా, దాద్రా & నగర్ హవేలీలో నిర్మాణంలో ఉంది, గుజరాత్‌లో కాదు. నమో మెడికల్ కాలేజీ పూర్తి పేరు నేషనల్ మోడరన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్. మోదీ పేరు మీద ఈ నమో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు. 19 ఆగస్ట్ 2021న నిర్మాణ దశలో ఉన్న నమో మెడికల్ కాలేజీ కొంత భాగం వర్షపు తుఫానుకు కూలింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

నమో మెడికల్ కాలేజీ సిల్వస్సా, దాద్రా & నగర్ హవేలీలో ఉంది, గుజరాత్‌లో కాదు. కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) దాద్రా & నగర్ హవేలీలోని సిల్వస్సాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నవంబర్ 2018లో ఆమోదం తెలిపింది. 19 జనవరి 2019న ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయిని వేశారు. మొదటి అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ 15 ఆగస్టు 2019న ప్రారంభమైంది. నమో మెడికల్ కాలేజీ పూర్తి పేరు నేషనల్ మోడరన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్. మోదీ పేరు మీద నమో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు.

కొన్ని న్యూస్ ఆర్టికల్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం, 19 ఆగస్ట్ 2021న దాద్రా నగర్ హావేలీలోని సిల్వాస్సా ప్రాంతానికి చెందిన సయ్లీలో నిర్మాణంలో ఉన్న నమో మెడికల్ కాలేజీ, వర్షపు తుఫానుకు కొంత భాగం కుప్పకూలింది. కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కళాశాలలోని ఒక భాగం పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వలన ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

చివరగా, నమో మెడికల్ కాలేజీ దాద్రా & నగర్ హవేలీలో ఉంది, గుజరాత్‌లో కాదు; వర్షపు తుఫానుకు ఒక భాగం పైకప్పు కూలిపోయింది.

Share.

About Author

Comments are closed.

scroll