Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోని అఫ్గానిస్తాన్‌ దేశంలో మహిళలని గొలుసులతో కట్టి వేలం వేస్తున్న దృశ్యమని షేర్ చేస్తున్నారు

0

భారతీయ ముస్లిం మహిళల పరిస్థితిని, అఫ్గానిస్తాన్‌ ముస్లిం యువతుల పరిస్థుతులతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అఫ్గానిస్తాన్‌ దేశంలో మహిళలను గొలుసులతో కట్టి వేలం నిర్వహిస్తున్న దృశ్యాలంటూ ఈ పోస్టులో ఒక ఫోటోని షేర్ చేసారు. మహిళా హక్కుల కోసం పోరాటం చేసే భారతీయ మహిళలు, అఫ్గానిస్తాన్‌ దేశంలో ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయడం లేదని ఈ పోస్టులో ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్‌ మహిళలను గొలుసులతో కట్టి వేలం నిర్వహిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2014లో లండన్ నగరంలో నిర్వహించిన ఒక ప్రదర్శన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు నడిపిస్తున్న సెక్స్ స్లేవ్ మార్కెట్ల గురించి అవగాహన కల్పిస్తూ కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. తాలిబాన్ పాలనలో అఫ్గానిస్తాన్‌ మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో అఫ్గానిస్తాన్‌ దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఒక యూసర్ 16 అక్టోబర్ 2014 నాడు ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది 2014లో లండన్ నగరంలో నిర్వహించిన ఒక ప్రదర్శన దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని ‘Newsweek’ వెబ్సైటు తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.  లండన్ నగరంలో కుర్దిష్ నిరసనకారులు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదుల చర్యలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

2014లో లండన్ నగరంలో నిర్వహించిన ఈ నిరసనకు సంబంధించి ‘BBC’ న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు నడిపిస్తున్న సెక్స్ స్లేవ్ మార్కెట్ల గురించి అవగాహన కల్పిస్తూ కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. డౌనింగ్ స్ట్రీట్, హౌసెస్ అఫ్ పార్లమెంట్ సమీపంలో కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ ‘Huffington post’ న్యూస్ సంస్థ 16 అక్టోబర్ 2014 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో లండన్ నగరంలో ఇచ్చిన ఒక పాత ప్రదర్శనకు సంబంధించిన ఫోటో అని, అఫ్గానిస్తాన్‌ దేశానికి సంబంధించిన ఫోటో కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

తాలిబాన్ పరిపాలనలో (1996 నుండి 2001) అఫ్గానిస్తాన్‌ మహిళలపై అనేక అఘాయిత్యాలు మరియు ఆంక్షలు విధించినట్టు పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. అఫ్ఘాన్ మహిళలను సెక్స్ బానిసలాగా మార్చడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, వారి చదువు పై ఆంక్షలు పెట్టడం వంటి ఎన్నో దుర్మార్గపు చర్యలని తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిపాలనలో చేపట్టినట్టు చాలా వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా ప్రభుత్వం ఇటీవల అఫ్గానిస్తాన్‌ దేశం నుండి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఆదేశించడంతో, తాలిబాన్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ దేశాన్ని మళ్ళీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అఫ్ఘాన్ మహిళల హక్కులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 

చివరగా, సంబంధం లేని పాత ఫోటోని అఫ్గానిస్తాన్‌ దేశంలో మహిళలని గొలుసులతో కట్టి వేలం వేస్తున్న దృశ్యమని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll