Fake News, Telugu
 

‘మోటార్ వెహికల్స్ రూల్స్, 1989’కి 2020లో చేసిన సవరణల ద్వారా పోలీసులకు వాహానాన్ని సీజ్ చేసే అధికారం ఉంది, కోర్టు ఉత్తర్వులు అవసరం లేదు

0

పెండింగ్ చలానాలు కట్టలేదని వాహనాన్ని సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడ్డట్టు చెప్తున్న ఒక న్యూస్ క్లిప్‌ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇదే విషయాన్ని పలు ప్రముఖ వార్తా సంస్థలు(ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ ) కూడా ప్రచురించాయి. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పెండింగ్ చలానాలు కట్టలేదని వాహనాన్ని సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదు – తెలంగాణ హైకోర్టు.

ఫాక్ట్ (నిజం): న్యూస్ క్లిప్ లో పెర్కొనట్టు తెలంగాణ హైకోర్టు చట్ట ప్రకారం చలానా కట్టలేదన్న కారణానికి వాహానాన్ని సీజ్ చేయకూడదని అనలేదు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం 90 కన్నా ఎక్కువ రోజులు చలాన్ పెండింగ్ ఉండి, ఈ సంబంధిత పెండింగ్ చలానా గురించి పోలీసులు వాహనదారునికి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా ఒక్కసారి తెలియ చేసిన సందర్భంలో పోలీసులకు ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. వాహనాన్ని సీజ్ చేయొద్దు అని ప్రత్యేకించి కోర్టు నుండి ఉత్తర్వులు ఉంటే తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పోలీసులు చలాన్లు పెండింగ్ ఉన్నాయన్న  కారణంతో వాహనాలను సీజ్ చేయొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వాహానంపై ఉన్న పెండింగ్ చాలాన్లను చెల్లించలేదన్న కారణంగా పోలీసులు వాహానాన్ని సీజ్ చేసిన ఒక కేసుకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే  పోస్టులోని వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతుంది. నిజానికి ఈ తీర్పులో కోర్టు ఎక్కడ కూడా చట్ట ప్రకారం చలాన్ కట్టలేదన్న కారణానికి వాహానాన్ని సీజ్ చేయకూడదని పేర్కొనలేదు. కేవలం పెండింగ్ చలానా చెల్లించి వాహానాన్ని వెనక్కి తీసుకోవడానికి పోలీసులకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలని మాత్రమే కోర్టు పిటిషనర్‌కి చెప్పింది. ఐతే కోర్టు చెప్పిన ఈ విషయాన్ని చెప్పకుండా తమకు అనుకూలంగా తీర్పుని వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ట్విట్టర్ ద్వారా ఈ వార్తని ఖండించారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 లోని రూల్ 167 ప్రకారం 90 కన్నా ఎక్కువ రోజులు చలానా పెండింగ్ ఉండి, ఈ సంబంధిత పెండింగ్ చలానా గురించి పోలీసులు వాహనదారునికి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా ఒక్కసారి తెలియ చేసి ఉంటే, పోలీసులకు ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు.

మోటార్ వెహికల్స్ రూల్స్, 1989:

ఐతే మోటార్ వెహికల్స్ రూల్స్, 1989కి 2020లో చేసిన సవరణల ద్వారా చేర్చిన రూల్ 167 (8) లో ‘కోర్టు ఉత్తర్వులకి లోబడి పోలీసులు వాహానాలను సీజ్ చేయాలి అని ఉందని, కాబట్టి పోలీసులకు వాహానాన్ని సీజ్ చేసే అధికారం లేదని కొందరు వాదిస్తున్నారు.

నిజానికి ఈ వ్యాఖ్యని ‘కేవలం కోర్టు ఉత్తర్వులు ఉంటే మాత్రమే పోలీసులు వాహానాలను సీజ్ చేయాలనీ’ అర్ధం చేసుకోవడం వల్ల ఈ చర్చ మొదలైంది. కాని చట్ట పరిభాషలో (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ సెక్షన్ లోని  ‘కోర్టు ఉత్తరువులకు లోబడి పోలీసులు వాహానాలను సీజ్ చేయవచ్చు’ అన్న వ్యాఖ్యకి అర్ధం ‘వాహనాన్ని సీజ్ చేయొద్దు అని ప్రత్యేకించి కోర్టు నుండి ఉత్తర్వులు ఉంటే తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పోలీసులు చలాన్లు పెండింగ్ ఉన్నాయన్న  కారణంతో వాహనాలను సీజ్ చేయొచ్చు’.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా చలానా పెండింగ్ ఉంటే పోలీసులకు వాహానాన్ని సీజ్ చేసే అధికారం ఉందని, ఈ విషయానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని ఒక ప్రకటన విడుదల చేసారు.

చివరగా, చలానా పెండింగ్ ఉంటే పోలీసులకు వాహానాన్ని సీజ్ చేసే అధికారం ఉంది, కోర్టు ఉత్తర్వులు అవసరం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll