Fake News, Telugu
 

వక్ఫ్ చట్టం రద్దుకు సంబంధించి BJP ఎంపీ రాజ్యసభలో ప్రవేశపెట్టింది ఒక ప్రైవేటు బిల్లు, దీనికి పార్టీతో సంబంధం లేదు

0

వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని రాజ్యసభలో BJP ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టిందని, ఆ బిల్లును రాజ్యసభ ఆమోదించిందన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని రాజ్యసభలో BJP ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టింది; ఆ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

ఫాక్ట్(నిజం): డిసెంబర్ 2023లో జరిగిన రాజ్యసభ సమావేశాలలో BJP ఎంపీ హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ 1995లో చేసిన వక్ఫ్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును(The Waqf Repeal Bill, 2022) ప్రవేశపెట్టాడు. ఐతే ఈ బిల్లును హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ తన పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఆసక్తిపై ప్రవేశపెట్టాడు అనుకోవచ్చు. ఈ బిల్లుతో BJPకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ బిల్లును కేవలం రాజ్యసభలో ప్రవేశపెట్టారు, దీని మీద చర్చ కానీ, రాజ్య సభ ఆమోదించడం కానీ జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గత డిసెంబర్ 2023లో జరిగిన రాజ్యసభ సమావేశాలలో వక్ఫ్‌ చట్టం,1995ను రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టింది నిజమే అయినప్పటికీ, ఆ బిల్లుతో BJPకు సంబంధం లేదు. పైగా రాజ్యసభ కేవలం ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఆమోదించింది, బిల్లును కాదు.

08 డిసెంబర్ 2023 BJP ఎంపీ హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ 1995లో చేసిన వక్ఫ్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును (The Waqf Repeal Bill, 2022) ప్రవేశపెట్టాడు. ఈ బిల్లును కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లు ప్రవేశపెట్టాలా లేదా అన్న విషయంపై వోటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 53 మంది, వ్యతిరేకంగా 32 మంది ఓటు వేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది.  ఈ క్రమంలోనే హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు:

ఐతే ఈ బిల్లును హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ తన పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఆసక్తిపై ప్రవేశపెట్టాడు అనుకోవచ్చు. సాధారణంగా మంత్రి కాని ఇతర ఎంపీలను ప్రైవేట్ మెంబర్ అని అంటారు. ఈ ప్రైవేట్ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్లులని, మంత్రులు ప్రవేశపెట్టిన వాటిని ప్రభుత్వ బిల్లులు అని అంటారు.

ప్రస్తుతం చర్చిస్తున్న వక్ఫ్‌ బిల్లును ప్రవేశపెట్టిన హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌  ఒక సాధారణ ఎంపీ కావడంతో, ఈ బిల్లుతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అనుకోవచ్చు. చట్టపరమైన జోక్యం అవసరమైన పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఎంపీలు ఇలా ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెడుతుంటారు. ప్రతీ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లోని రెండో భాగంలో మాత్రమే ఈ ప్రైవేటు బిల్లులకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటారు.

సహజంగా ఐతే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది, కానీ ఈ ప్రైవేటు బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉండదు. అందుకని ఈ బిల్లులు పాస్ అవడం చాలా అరుదు. అసలు ప్రైవేటు బిల్లులపై చర్చ జరిగే సందర్భాలు కూడా చాలా తక్కువ. ఈ వార్తా కథనం ప్రకారం 1952లో మొదటి లోక్ సభ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. చివరిసారిగా ఒక ప్రైవేటు బిల్లు చట్టంగా మారింది 1970లోనే.

కాగా హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి గత సంవత్సర బడ్జెట్ మరియు వర్షా కాల సమావేశాలలోనే ప్రయత్నించినప్పటికీ అప్పట్లో అది వీలుపడలేదు. ఐతే ఇప్పుడు ఈ బిల్లును కేవలం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీని మీద చర్చ కానీ, రాజ్య సభ ఆమోదించడం కానీ జరగలేదు. ఈ సమాచారాన్ని బట్టి కేవలం రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించిన వక్ఫ్ చట్టం రద్దు బిల్లును రాజ్యసభ ఆమోదించినట్టు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆర్ధమవుతుంది.

చివరగా, వక్ఫ్ చట్టం రద్దుకు సంబంధించి BJP ఎంపీ రాజ్యసభలో ప్రవేశపెట్టింది ఒక ప్రైవేటు బిల్లు, దీనికి పార్టీతో సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll