Fake News, Telugu
 

ఈ వీడియోలో గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్నది ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన నిందితుడిని కాదు

0

భరూచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సినిమాను తలపించేలా ఢిల్లీ అల్లర్ల నిందితుడు సిరాజ్ మహమ్మద్ అన్వర్ ని మరియు అతని ముఠాని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఒక హోటల్ లో కూర్చున్న వ్యక్తిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: భరూచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సినిమాను తలపించేలా ఢిల్లీ అల్లర్ల నిందితుడు సిరాజ్ మహమ్మద్ అన్వర్ ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అమరపుర గ్రామంలో 27 జూన్ 2021 నాడు చోటుచేసుకుంది. దొంగతనాలు మరియు అత్యాచార కేసులలో నిందితుడైన కిషోర్ లుహార్ ని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలివి. భరూచ్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇటీవల సిరాజ్ మంజూర్ ఆలం అన్సారి అనే ఆయుధాలు డీలర్ ని భరుచ్ నగరంలో అరెస్ట్ చేసారు. ఈ రెండు వేర్వేరు ఘటనలని 2020 ఢిల్లీ అల్లర్లకు ముడిపెడుతూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘The Times of India’ న్యూస్ వెబ్సైటు 01 జూలై 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో షేర్ చేసినట్టు తెలిసింది. వీడియోలోని ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అమరపుర గ్రామంలో 27 జూన్ 2021 నాడు చోటుచేసుకున్నట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. అహ్మదాబాద్ నగర సమీపంలో పలు దొంగతనాలు మరియు అత్యాచారాలు చేసిన కిషోర్ లుహార్ అనే నిందితుడిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలని ఈ ఆర్టికల్ లో తెలిపారు.

భరూచ్ నగర సమీపంలో సిరాజ్ మంజూర్ ఆలం అన్సారి అనే ఆయుధాలు డీలర్ ని లోకల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేసినట్టు ‘The Indian Express’ 30 జూన్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. బీహార్ కి చెందిన సిరాజ్, భరూచ్ నగరంలో చట్ట విరుద్దంగా ఆయధాలని అమ్ముతూ పట్టుబడినట్టు పోలీసులు మీడియాకి తెలిపారు.   

2020లో ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పెట్టిన ఛార్జ్ షీట్లో 15 మంది నిందితుల పేర్లని జత చేసినట్టు ‘ANI’ తమ ట్వీట్ లో పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్ లో పెట్టిన 15 మంది నిందితుల పేర్లని ‘India.com’ న్యూస్ వెబ్సైటు తమ ఆర్టికల్ లో బయటపెట్టింది. ఆ 15 మంది పేర్లలో సిరాజ్ మహమ్మద్ అన్వర్ అనే పేరు ఎక్కడ వెల్లడించలేదు. దీన్ని బట్టి, గుజరాత్ లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలని 2020 ఢిల్లీ అల్లర్లకు ముడిపెడుతూ ఈ వీడియోని షేర్ చేస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్నది ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన  నిందితుడిని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll