ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రస్తుతం విధించే జరిమానాను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ, 1 సెప్టెంబర్ 2023 నుండి ఇది అమలులోకి వస్తుంది అంటూ ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లెయిమ్: రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాను ప్రభుత్వం 1 సెప్టెంబర్ 2023 నుండి భారీగా పెంచబోతుంది.
ఫాక్ట్ (నిజం): ప్రభుత్వం వాహన నిబంధనలపై విధించే జరిమానా పెంచింది అన్న ఈ పోస్టులోని సమాచారం పాతది. ఈ జరిమానా వివరాలు మోటార్ వాహనాల (సవరణ) చట్టం, 2019 లోనివి. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఈ పోస్టుకు సంబంధించిన వివరాలను ఇంటర్నెట్లో వెతకగా, ఇటీవల ప్రభుత్వం మోటార్ వాహనాలకు సంబంధించి ఎటువంటి చట్టాన్ని సవరించలేదని తెలుస్తుంది. పైగా, ఈ వివరాలు మోటార్ వాహనాల సవరణ చట్టం, 2019కు సంబంధించిన వివరాలు అని పలు వార్తా పత్రికలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) 2019లో రిపోర్ట్ చేసాయి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్నీ 2019లో ట్వీట్ చేసింది. ఈ నిబంధనలు 1 సెప్టెంబర్ 2019 నుండి అమలులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు అదే వార్తని 1 సెప్టెంబరు 2023కు ముందు ప్రచారం చేస్తున్నారు.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రోడ్డు భద్రత కోసం, మోటార్ వాహనాల బిల్లు, 1988ను సవరించి, 15 జులై 2019న మోటారు వాహనాల (సవరణ) బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. 9 ఆగస్టు 2019న రాష్ట్రపతి ఆమోదం పొంది ఇది మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019గా మారింది.
ఈ చట్టం, మోటారు వాహనాలకు సంబంధించిన లైసెన్సులు, అనుమతుల మంజూరు, మోటారు వాహనాల ప్రమాణాలు మరియు ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలను నిర్దేశిస్తుంది. బిల్లు యొక్క కొన్ని ముఖ్య అంశాలు:
- ట్రాఫిక్ ఉల్లంఘనను ఆపేందుకు జరిమానాలను పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
- ప్రమాదం తరువాత మొదటి గంట సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించాలి.
- కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్‌ను రూపొందించాలి.
- రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేందుకు, గుడ్ సమరిటన్ రక్షణకు మార్గదర్శకాలను ఈ చట్టం అందిస్తుంది.
- భారతదేశంలోని రహదారి వినియోగదారులందరికీ, కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేయాలి.
- వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి, డ్రైవర్‌కు లేదా ఇతర రహదారి వినియోగదారులకు నష్టం కలిగేలా ఉంటే మోటారు వాహనాలను కేంద్ర ప్రభుత్వం రీకాల్ చెయ్యాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రవాణా విధానాన్ని అభివృద్ధి చేయవచ్చు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అమలులో ఉన్న జరిమానా వివరాలను ఇక్కడ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) చూడవొచ్చు.
చివరిగా, మోటార్ వాహనాల (సవరణ) చట్టం, 2019 యొక్క జరిమానా వివరాలను కొత్త నిబంధనలుగా ఇప్పుడు షేర్ చేస్తున్నారు.